గ్రౌండ్ ఖాళీ కానీ ఉదృతంగా ఎన్నికల ప్రచారం... నేటితో ముగింపు

January 20, 2020


img

ఈసారి మునిసిపల్ ఎన్నికలలో ప్రతిపక్షాలు అన్ని వార్డులలో అభ్యర్ధులను నిలబెట్టలేనంత బలహీనంగా ఉన్నాయని... గ్రౌండ్ ఖాళీగా ఉందని.. ఎన్నికలు ఏకపక్షమేనని టిఆర్ఎస్‌ పదేపదే వాదించినప్పటికీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో చాలా ఉదృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం. అది దాని అభద్రతాభావానికి అద్దం పడుతోందా...లేదా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలను ఈ ఎన్నికలలో మరోసారి చావుదెబ్బ తీసి వాటి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చాలనే పట్టుదలో తెలియదు కానీ టిఆర్ఎస్‌ చాలా జోరుగా ప్రచారం చేసింది. 

ఇక టిఆర్ఎస్‌ చెప్పినట్లుగా కాంగ్రెస్‌, బిజెపిలు కొన్ని వార్డులలో అభ్యర్ధులను నిలబెట్టలేకపోయినప్పటికీ అవి కూడా జోరుగానే ప్రచారం చేశాయి. మళ్ళీ వాటిలో బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీయే జోరుగా ప్రచారం చేసింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో మజ్లీస్ అభ్యర్ధులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్ధులు కూడా జోరుగానే ఎన్నికల ప్రచారం చేసుకొన్నారు. 

బుదవారం ఉదయం నుంచి పోలింగ్ మొదలవుతుంది కనుక నిబందనల ప్రకారం నేటి సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం నిలిపివేయవలసి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈరోజు సాయంత్రం 5 గంటలు తరువాత మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నికల ప్రచారం చేయడానికి వీలు లేదని తెలిపింది. నిబందనలు ఉల్లంఘించినవారికి చట్ట ప్రకారం జరిమానా, రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 22న పోలింగ్ నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.


Related Post