చాలా బాధగా...సంతోషంగా కూడా ఉంది: రేవంత్ రెడ్డి

January 14, 2020


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ ఒక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మరొక రాష్ట్రంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాటి ప్రభావం కూడా ఎంతో కొంత కనబడుతూనే ఉంది. 

ఏపిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకొన్న అన్ని నిర్ణయాలను పక్కన పెట్టడమో లేదా తిరగదోడడమో చేస్తోంది. వాటిలో భాగంగానే ఇసుక విధానాన్ని కూడా పునః సమీక్షించే ప్రయత్నంలో రాష్ట్రంలో దాదాపు ఆరు నెలల పాటు ఇసుక సరఫరాను అనధికారికంగా నిలిపివేసింది. ఆ కారణంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. దాంతో వాటిపైనే ఆధారపడిన లక్షలాది మంది భవన నిర్మాణకార్మికులు రోడ్డున పడ్డారు. 

ఎట్టకేలకు ఇసుక సరఫరా మొదలయ్యేసరికి జగన్ ప్రభుత్వం ఏపీ రాజధానిని విశాఖకు తరలింపు, మూడు రాజధానుల ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. దాంతో ఏపిలో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆ కారణంగా అమరావతితో సహా ఏపీలో పలు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. అంతేకాదు... జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యల తీవ్రతను తగ్గించే ప్రయత్నంలో వైసీపీ మంత్రులు, ఎమ్మేల్యేలు, నేతలు మాట్లాడుతున్న మాటలు ఇంకా గందరగోళం సృష్టిస్తున్నాయి.  పైగా జగన్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకార ధోరణి చూసి రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలే కాదు...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో కూడా ఒకరకమైన భయాందోళనలు నెలకొని ఉన్నాయి. దాంతో ఏపీ ప్రభుత్వం విశ్వసనీయత, ప్రతిష్ట రెండూ దెబ్బ తింటున్నాయి. ఈ కారణంగా ఇప్పుడు రాజధాని కాబోతున్న విశాఖలో సైతం రియాల్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు. కనుక సహజంగానే వారందరూ పొరుగునే స్థిరంగా అభివృద్ధిపధంలో సాగిపోతున్న తెలంగాణ రాష్ట్రంవైపు చూస్తున్నారిప్పుడు. కనుక తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, రియల్ ఎస్టేట్  వ్యాపారం మరింత వేగం పుంజుకొనే అవకాశాలు కనబడుతున్నాయి.  

ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి మేలు కలుగుతున్నందుకు తెలంగాణ పౌరుడిగా ఓపక్క సంతోషం కలుగుతోంది. అదే సమయంలో ఏపీలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూస్తుంటే ఒక భారతీయుడిగా చాలా బాధ కలుగుతోంది. నిన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న ప్రజలు రాజధాని పేరిట తగువులు ఆడుకోవడం చూసి చాలా బాధ కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదారాబాద్ లోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వైసీపీకి బారీగా సహాయం అందించాడు. అందుకు ప్రతిగా ఇప్పుడు అతనికి హైదారాబాద్ లో లబ్ది కలిగించేందుకే జగన్ ప్రభుత్వం ఈ అనూహ్య ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ఉండవచ్చునని అనుమానం కలుగుతోంది,” అని రేవంత్ రెడ్డి అన్నారు. 


Related Post