టిడిపిని తెరాసలో కలిపేయాలన్న మోత్కుపల్లే నేడు...

January 11, 2020


img

టిడిపి నుంచి బహిష్కరించబడిటంతో రాజకీయ నిరుద్యోగిగా మారిన మోత్కుపల్లి నర్సింహులును బిజెపి ఆహ్వానించడంతో ఇటీవల ఆ పార్టీలో చేరిపోయారు.

ఆయన బిజెపిలో చేరగానే ఊహించినట్లే సిఎం కేసీఆర్‌పై విమర్శలు మొదలుపెట్టారు. డిల్లీలో బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తెలంగాణకు 8వ నిజాం నిరంకుశ నవాబు వంటివారు. ఆయన రాష్ట్రానికి పట్టిన చీడ. ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుంచి దించేయాలని నేను యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకొంటాను. సిఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. దళితులు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. వారికి సంక్షేమ పధకాలు అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు తెరాస సర్కార్‌ ఫీజు రీ ఇంబర్సుమెంట్ చెల్లించడం లేదు. కనుక రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం వారి తరపున నేను నిరంతరం పోరాడుతూనే ఉంటాను,” అని అన్నారు. 

రాష్ట్రంలో టిడిపి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతునప్పుడు ఆయన తెరాసలో చేరాలనుకొన్నారు కానీ తెరాస ఆయనకు ఆహ్వానం పలుకలేదు. దాంతో టిడిపిని తెరాసలో విలీనం చేసేయాలని ప్రతిపాదన చేసి ఎదురుదెబ్బ తిన్నారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిఎం కేసీఆర్‌ కోరితే తాను తెరాస తరపున నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసి తెరాస అభ్యర్ధులను గెలిపిస్తానని ప్రకటించారు. కానీ తెరాస స్పందించకపోవడంతో సిపిఎం కూటమి అభ్యర్ధిగా ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

తెరాసలో చేరాలని ఇంతగా తాపత్రయపడిన మోత్కుపల్లి ఇప్పుడు బిజెపిలో చేరగానే తెరాస అధినేత సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి ఈవిధంగా మాట్లాడుతున్నారు. ఆనాడు టిడిపి నుంచి బహిష్కరించబడినప్పుడు చంద్రబాబునాయుడు ఓడిపోతే తిరుపతికి వచ్చి వెంకన్న దర్శనం చేసుకొంటానని మొక్కుకొన్న మోత్కుపల్లి, ఇప్పుడు కేసీఆర్‌ను దిగిపోతే యాదాద్రికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కు చెల్లించుకొంటానని చెపుతున్నారు. ఏమనుకోవాలి? 


Related Post