మోడీ ప్రభుత్వం ఆ ఒక్క బలహీనతని అధిగమించగలిగితే చాలు

August 09, 2016


img

గతంలో కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఉదారంగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసేది కాదు. ముఖ్యమంత్రులకి కూడా తగిన గౌరవం లభించేది కాదు. అధిష్టానం ఆశీర్వాదం ఉన్నంత కాలమే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనే అవకాశం. దాని దయ తప్పితే కుర్చీ ఖాళీ చేసేయాల్సిందే. కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత, రాష్ట్రాలకి ఉదారంగా నిధులు, ప్రాజెక్టులు మంజూరవుతున్నాయి. రాష్ట్రాల అభివృద్ధి కొరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. అందుకు కారణం రాజకీయాలని ఒక స్థాయికి పరిమితం చేసి అభివృద్ధి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచించడమే. తన ఆలోచనలకి, ఆశయాలకి తగ్గట్లుగా అర్హులైన వారిని ముఖ్యమైన పదవులలో నియమించుకొని చాలా పారదర్శకంగా, చురుకుగా అవినీతిరహితంగా పాలన చేస్తున్నారు.

ఎన్డీయే ప్రభుత్వంతో, భాజపాతో ఎటువంటి సంబంధం లేని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ విషయాన్ని మొన్న గజ్వేల్ సభలో చాటి చెప్పారు. కేంద్రంలో నిజంగా పనిచేసే ప్రభుత్వం ఉండటం చాలా గొప్ప విషయమే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనే రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. లేనివి రాజకీయాలు చేసుకొంటూ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు మిగిలిపోతాయి.

అయితే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలతో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. అందుకు కారణాలు ఏవయినా కావచ్చు కానీ మోడీ ప్రభుత్వం ఆ బలహీనతని కూడా అధిగమించగలిగితే ఇక దానికి తిరుగుండదు. మోడీ హయాంలో దేశంలో అన్ని రాష్ట్రాలు సమానంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలు నమ్మినట్లయితే ఇంక ఎటువంటి రాజకీయాలు చేయనవసరం లేకుండానే ప్రజలే మళ్ళీ ఎన్డీయే కూటమికి, మోడీకి తప్పకుండా పట్టం కడతారు.


Related Post