ఎన్‌కౌంటర్‌..బేఫికర్..హైదరాబాద్‌లో మరో రేప్

December 14, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో తెలంగాణతో సహా దేశంలో అత్యాచారాలు చేయాలనుకొనేవారు భయపడతారని అందరూ భావించారు. కానీ ఆ ఎన్‌కౌంటర్‌ జరిగిన రెండు రోజులకే హైదరాబాద్‌లో మరో అత్యాచారం జరిగింది. డిసెంబర్ 6 తెల్లవారుజామున దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరుగగా, దానిపై మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నప్పుడే, 8వ తేదీ రాత్రి నాంపల్లిలో ఓ 18 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది.

చాంద్రాయణగుట్ట పోలీసుల సమాచారం ప్రకారం, గత ఆదివారం సాయంత్రం అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ జహాంగీర్ పీర్ దర్గా వెళ్ళేందుకు హష్మాబాద్ వద్ద ఆటో ఎక్కారు. అప్పటికే చీకటి పడుతున్నందున ఆ సమయంలో దర్గా వద్దకు వెళ్ళడం ప్రమాదమని, రేపు ఉదయమే దర్గా వద్దకు తీసుకువెళ్ళి చూపిస్తానని వారికి నచ్చజెప్పి ఆటో డ్రైవర్ మహ్మద్ అమీర్ వారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ అతని తల్లితండ్రులు కోప్పడటంతో అతని సోదరుడు మూసా కలుగజేసుకొని వారిని నాంపల్లివద్ద దింపివస్తానని తన బైక్‌పై ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. కానీ అతను వారికి మాయమాటలు చెప్పి హోటల్ గ్రాండ్ ఓయోలో రూమ్ బుక్‌ చేసి లోపలకు తీసుకువెళ్ళాడు.

తనకు సహకరించకపోతే చెల్లెలిని చంపేస్తానని బెదిరిస్తూ చెల్లి ఎదుటే అక్కపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత వారిరువురినీ ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ వద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ భయంభయంగా తిరుగుతున్న అక్కా చెల్లెళ్ళను చూసి రైల్వే పోలీసులు  చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సాయంత్రం బయటకు వెళ్ళిన వారిరువురూ రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో బాలికల తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రైల్వే పోలీసుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడకు వెళ్ళి వారిరువురినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారు జరిగిందంతా తల్లితండ్రులకు, పోలీసులకు వివరించారు.

పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని హోటల్ గ్రాండ్ ఓయోకు వెళ్ళి నిందితుడి గురించి దర్యాప్తు చేయగా అతను నకిలీ గుర్తింపు కార్డు, ఫోన్‌ నెంబర్లను ఇచ్చినట్లు తెలిసింది. కానీ అక్కచెల్లెళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం నిందితుడి ఇంటికి వెళ్ళి మహ్మద్ అమీర్, మూసాలను అదుపులోకి తీసుకొని ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు.

ఈ ఘటన డిసెంబర్ 8వ తేదీ రాత్రి జరిగితే నేటి వరకు బయటకు పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు ఇద్దరు అమ్మాయిలను రాత్రిపూట హోటల్ తీసుకొనివస్తే ఓయో హోటల్ సిబ్బంది ఎటువంటి అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా వారికి రూమ్ ఏర్పాటు చేయడం చూస్తే ఆ హోటల్లో నిత్యం వ్యభిచార కలాపాలు జరుగుతుంటాయా? అందుకే వారికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా రూమ్ ఇచ్చారా? అనే అనుమానం కలుగుతోంది.

ఏది ఏమైనప్పటికీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ చూసి రేపిస్టులు ఏమాత్రం భయపడటం లేదని ఈ ఘటనతో స్పష్టం అవుతోంది. కనుక ఇటువంటి కేసులలో దోషులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది. 


Related Post