వచ్చే మేలో దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి రెడీ?

December 10, 2019


img

హైదరాబాద్‌లో దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే జూబ్లీ హిల్స్, గచ్చిబౌలీ, మాదాపూర్, మైండ్ స్పేస్‌ల మద్య ప్రయాణం మరింత సుఖవంతంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. 

ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో బరూచ్ జిల్లాలో గల 114 మీటర్లు పొడవు ఉండే కేబిల్ బ్రిడ్జి దేశంలోకెల్లా అతిపెద్దదిగా నిలిచింది. కానీ దుర్గం చెరువుపై రూ.184 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ కేబిల్ బ్రిడ్జి పొడవు 754.88 మీటర్లు. ఇది పూర్తయితే దేశంలో కెల్ల అతిపెద్ద కేబిల్ బ్రిడ్జిగా నిలుస్తుంది. అలాగే ప్రపంచంలో 3వ అతిపెద్ద కేబిల్ బ్రిడ్జిగా నిలుస్తుంది.  దుర్గం చెరువుకు ఇరువైపుల భారీ పిల్లర్లు నిర్మించి వాటిని ఇనుపతీగలతో కలిపి ఆ తీగలపై బ్రిడ్జిని బిగిస్తారు. కనుక బ్రిడ్జి క్రిందన మద్యలో ఎక్కడా స్థంభాలు ఉండవు. పూర్తిగా ఇనుపతీగలపై వ్రేలాడుతుంటుంది. 


కేబిల్ బ్రిడ్జి ఆ చివర నుంచి ఈ చివర వరకు అందమైన విద్యుత్ దీపాలను అమర్చుతారు. కేబిల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు దుర్గం చెరువు సుందరీకరణలు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. పరిసర ప్రాంతాలలో పొగుపడిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించి రకరకాల మొక్కలు నాటుతున్నారు. అలాగే పార్కులో జాగింగ్, సైక్లింగ్ ట్రాకులు వేర్వేరుగా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇక దుర్గంచెరువులో నీళ్ళపై తేలియాడే అందమైన రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయబోతున్నారు. కనుక చీకటి పడిన తరువాత కేబిల్ బ్రిడ్జిపై ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్‌ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే ఏడాది మే-జూన్ నెలలోపుగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు.


Related Post