యోగనిద్రలో నుంచి ముందే మేల్కొని ఉంటే...

December 09, 2019


img

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అలాగే అక్కడ నేరాల సంఖ్య కూడా చాలా ఎక్కువే. అయితే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నేరాలను పూర్తిగా అదుపుచేసి రామరాజ్యం స్థాపిస్తామనే హామీతో బిజెపి అధికారంలోకి వచ్చింది. యోగీ ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. కానీ నేటికీ ఆ పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు. 

అందుకు తాజా ఉదాహరణగా ఉన్నావ్ ఘటన చెప్పుకోవచ్చు. ఉన్నావ్‌లో అత్యాచారానికి గురైన ఓ యువతి ఏడాదిగా కోర్టు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం లభించలేదు. పైగా నిందితులు ఆమెను నడిరోడ్డుపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశారు. దిశ ఘటనతో దేశం దద్దరిల్లుతున్న సమయంలోనే ఇది జరుగడంతో సిఎం ఆదిత్యనాధ్ యోగ నిద్రలో నుంచి మేల్కొని సమస్యలపై దృష్టి సారించారు. 

రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న అత్యాచారాలను, చిన్నారులపై లైంగికదాడులపై విచారణ జరిపేందుకు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 218 ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సిఎం ఆదిత్యనాధ్ నిర్ణయించారు. వాటిలో 114 ఫాస్ట్-ట్రాక్ కోర్టులు అత్యాచార కేసులను, మిగిలిన 74 చిన్నారులపై లైంగికదాడుల కేసులను విచారిస్తాయి. హైకోర్టు అనుమతితో త్వరలోనే ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నట్లు యోగి ఆదిత్యనాధ్ తెలిపారు. 

ఆయన అధికారం చేపట్టినప్పటికే రాష్ట్రంలో హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, లైంగిక దాడులు చాలా జరుగుతుండేవి. వాటిని అరికడతానని చెప్పుకొనే బిజెపి అధికారంలోకి వచ్చింది కనుక సిఎం ఆదిత్యనాద్‌కు ఆ విషయం తెలియదనుకోలేము. కనుక ఆయన అప్పుడే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాఉండి ఉంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఏర్పడి ఉండేది. ఉన్నావ్ దిశ నేడు బ్రతికి ఉండేది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడంలో ఇంత ఆలస్యం చేయడంతో రాష్ట్రంలో ఎంతో మంది అత్యాచారాలకు బలైపోయారు. 

ఒకేసారి 218 ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కనీసం ఇప్పటికైనా ఆదిత్యనాధుడు యోగ నిద్రలో నుంచి మేల్కోవడం ఆ రాష్ట్ర మహిళల అదృష్టమనే చెప్పాలి.


Related Post