యూపీలో మరో దిశ...మృతి

December 07, 2019


img

దిశ ఘటనలో బాధితురాలు వెంటనే సజీవదహనం చేయబడగా, యూపీలో ఉన్నావ్ అనే ప్రాంతంలో దిశ తరహాలోనే సామూహిక అత్యాచారానికి గురైన ఓ యువతి న్యాయపోరాటం చేస్తుండగా నిందితులు దారికాసి ఆమెపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆమెకు 90 శాతం కాలిన గాయాలవడంతో శుక్రవారం రాత్రి డిల్లీలో సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

ఉన్నావ్ కు చెందిన శుభం త్రివేది అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకొంటానని మాయమాటల చెప్పి గత ఏడాది డిసెంబరులో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత అతని స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌పై జైలుకు పంపించారు. కానీ వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. గురువారం ఉదయం ఈ కేసు విచారణకు ఆమె రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళుతుండగా నిందితులు దారికాసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. 

ఆమె బాధ భరించలేక హాహాకారాలు చేస్తూ రోడ్డుపై పరుగులు తీసింది. అంత బాధలో కూడా ఆమె 112కు ఫోన్‌ చేసి పోలీసులకు తన పరిస్థితిని వివరించి సహాయం కోరడం చాలా గొప్ప విషయం. పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని ఆమెను లక్నోలో ఆసుపత్రిలో చేర్పించారు. కానీ వైద్యుల సూచన మేరకు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ లో డిల్లీకి తరలించి సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యాచారం కేసులో ఎంతో ధైర్యంగా పోరాడిన ఆమె మృత్యువుతో పోరాడలేక ఓడిపోయింది. అయితే చనిపోయే ముందు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తనను సజీవదహనం చేయడానికి ప్రయత్నించిన వారి పేర్లను, వివరాలను తెలియజేయడంతో పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు.

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై యావత్ దేశమంతా హర్షించింది. దిశకు సత్వర న్యాయం జరిగిందని మంత్రులు సైతం గొప్పగా చెప్పుకొంటున్నారు. కానీ ‘ఉన్నావ్ దిశ’ ఏడాదిగా న్యాయపోరాటం చేస్తున్నా ఆమెకు న్యాయం లభించలేదు పైగా అతికిరాతకంగా నడిరోడ్డుపై సజీవ దహనం చేయబడింది. న్యాయవిచారణలో జాప్యమే దీనికి కారణమని చెప్పక తప్పదు. సున్నితమైన ఇటువంటి కేసులను కూడా సాధారణ కేసులలాగే పరిగణిస్తూ ఏళ్ళ తరబడి సాగదీస్తుంటే నిందితులు ఇలాగే ప్రవర్తిస్తుంటారని చెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. కనీసం ‘ఉన్నావ్ దిశ’ చనిపోయిన తరువాతైనా ఆమెకు న్యాయం జరుగుతుందా?


Related Post