ప్రియాంకా రెడ్డి హంతకులు ప్రజల చేతికి చిక్కి ఉంటే...

November 30, 2019


img

ఈరోజు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు కులమతాలకు అతీతంగా వేలాదిమంది ప్రజలు తరలివచ్చి ప్రియాంకా రెడ్డి హంతకులను నడిరోడ్డుపై ఉరి తీయలంటూ రోజంతా ఆందోళనలు చేశారు. ఒకానొక సమయంలో వారు పోలీసు వలయాలను చేధించుకొని పోలీస్‌స్టేషన్‌లో జొరబడి హంతకులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారీనందరినీ చెదరగొట్టారు.

నిందితులను కోర్టులో హాజరు పరిచేముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉంది. కానీ ఆ పరిస్థితులలో బయటకు తీసుకువెళితే ప్రజలే వారిని చంపేస్తారని భయంతో వైద్యులనే పోలీస్‌స్టేషన్‌కు రప్పించి స్టేషన్లోనే పరీక్షలు జరిపించారు. ఆ తరువాత వారిని కోర్టుకు తీసుకు వెళ్ళి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచవలసి ఉంది. కానీ మేజిస్ట్రేట్‌ను కూడా పోలీస్‌స్టేషన్‌కు రప్పించవలసి వచ్చింది. దానిని బట్టి అక్కడి పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

మేజిస్ట్రేట్ వారికి 14 రోజులు రిమాండ్ విదించి వెళ్ళిపోయారు. ఇక అప్పుడు నిందితులను జైలుకు తరలించక తప్పదు కనుక పోలీస్‌స్టేషన్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించేటప్పుడు దారి పొడవునా పోలీసులను మోహరించవలసి వచ్చింది. అయినప్పటికీ ఎక్కడికక్కడ ప్రజలు వారిని తీసుకువెళుతున్న పోలీస్ వాహనాలపై రాళ్ళు , చెప్పులు విసురుతూ దాడులు చేస్తూనే ఉన్నారు. అతికష్టం మీద పోలీసులు నలుగురు నిందితులను జైలుకు చేర్చిన తరువాత ఊపిరి తీసుకొన్నారు.

ఒకవేళ ఇవాళ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ప్రజలను అదుపు చేయడంలో విఫలమైయుంటే ప్రజల చేతిలో ఆ నలుగురు నిందితులు ఖచ్చితంగా హతమై ఉండేవారని చెప్పక తప్పదు. అదే జరిగి ఉండి ఉంటే మన చట్టాలు, న్యాయవ్యవస్థలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని చెప్పుకోవలసి వచ్చేది. కానీ అదృష్టవశాత్తు పోలీసులు నిందితులను ప్రజల బారి నుంచి కాపాడి మన చట్టాలను, న్యాయవ్యవస్థకు ఆ అపకీర్తి రాకుండా కాపాడారని చెప్పక తప్పదు. డిల్లీలో నిర్భయ కేసు తరువాత దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో నిరసనలు, ప్రజాగ్రహం వ్యక్తం కాలేదనే చెప్పాలి. కనుక న్యాయస్థానం కూడా వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి దోషులకు చట్ట ప్రకారం కటినశిక్షలు విధించి వాటిని వెంటనే అమలుచేసినప్పుడే ఇటువంటి నేరస్తులకు భయం పుడుతుంది. ప్రజాగ్రహం కూడా చల్లారుతుంది.


Related Post