ఆర్టీసీ సమ్మెపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ స్పందన

November 21, 2019


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్ కుమార్‌, ధర్మపురి అరవింద్, సోయం బాపూ రావు గురువారం కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కారీని కలిసి ఆర్టీసీ సమ్మె గురించి తెలియజేసి సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సిఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని ఆయన చెప్పారని నలుగురు బిజెపి ఎంపీలు డిల్లీలో మీడియాకు తెలియజేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని, అధికారులను డిల్లీకి పిలిపించి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని నితిన్ గడ్కారీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సిఎం కేసీఆర్‌ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు కనుకనే కేంద్రం జోక్యం చేసుకోవలసి వస్తోందని జి.కిషన్‌రెడ్డి అన్నారు. కనుక ఇకనైనా సిఎం కేసీఆర్‌ మొండిపట్టుదల విడిచిపెట్టి ఆర్టీసీ కార్మికులను తక్షణం విధులలోకి తీసుకొని వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. 

గత 47 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర బిజెపి వారికి మద్దతు ఇచ్చిందే తప్ప ఇటువంటి ప్రయత్నం చేయలేదు. మొదట 10-15 రోజులలోనే పరిస్థితి అర్ధమైంది కనుక అప్పుడే వారు కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసి ఉండి ఉంటే ఇన్ని రోజులు సమ్మె కొనసాగేదీ కాదు...29 మంది కార్మికులు చనిపోయుండేవారూ కారు కదా?


Related Post