విధులలో చేరితే సమస్యలు పరిష్కారమవుతాయా?

November 21, 2019


img

ఆర్టీసీ సమ్మె కేసు కార్మిక న్యాయస్థానానికి బదిలీ అవడంతో అయోమయంలో పడిన ఆర్టీసీ కార్మిక సంఘాలు సుదీర్గంగా చర్చించుకొన్న తరువాత బేషరతుగా సమ్మె విరమించాలని నిర్ణయించుకొన్నాయి. వారి ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించవలసి ఉంది. 

ఒకవేళ ప్రభుత్వం వారిని మళ్ళీ విధులలోకి తీసుకొన్నప్పటికీ ఆర్టీసీలో పేరుకుపోయిన సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల కారణంగా మళ్ళీ త్వరలోనే ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఏవిధంగా అంటే..ముందుగా ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ నెల జీతం బకాయి చెల్లించవలసి ఉంది. హైకోర్టు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారికి జీతాలు చెల్లించేందుకు అంగీకరించని ప్రభుత్వం ఇప్పుడు వారు విధులలో చేరగానే వెంటనే చెల్లిస్తుందా?చెల్లిస్తే ఇంతకాలం బకాయిల చెల్లింపుపై హైకోర్టులో చేసిన వాదనలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లవుతుంది. చెల్లించకపోతే ఆర్టీసీ కార్మికులు ఊరుకోరు. కనుక మళ్ళీ ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. 

పనిచేసిన రోజులకే జీతం చెల్లించడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వం సమ్మె కాలానికి జీతం ఇస్తుందనుకోవడం అత్యశే అవుతుంది. కనుక ఆర్టీసీ కార్మికులు తమ సొసైటీ నుంచి అప్పు తీసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ అందులో డబ్బును ఆర్టీసీ యాజమాన్యం ఎప్పుడో వాడేసుకొంది కనుక అక్కడా ఘర్షణ ఏర్పడవచ్చు.    

ఆర్టీసీ కార్మికులు యూనియన్లలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ప్రభుత్వం పట్టుపడుతోంది. ఆవిధంగా లేఖలు ఇచ్చిన తరువాత ‘ప్రభుత్వాన్ని ధిక్కరించి సమ్మె చేసినందుకు’ ఆర్టీసీ యాజమాన్యం వారిపై క్రమశిక్షణ చర్యలు చేపడితే ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం మళ్ళీ యూనియన్లను ఏర్పాటు చేసుకోకతప్పదు. అదే జరిగితే మళ్ళీ కధ మొదటికొస్తుంది.  

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తేనే లాభాలు వస్తాయని బల్లగుద్ది వాదిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీలో 5,100 (సగం) బస్సు రూట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ధృడనిశ్చయంతో ఉంది. దానిపై హైకోర్టు స్టే విధించినప్పటికీ ఏదో ఒకరోజు తొలగించక తప్పదు. కనుక భవిష్యత్‌లో ఆర్టీసీలో ప్రైవేట్‌ బస్సులు ప్రవేశం తధ్యం. ఆర్టీసీలో సొంత బస్సులు సగం తగ్గిపోతే ఆ మేరకు ఆర్టీసీ కార్మికులను కూడా తొలగించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి వస్తే ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి మళ్ళీ పోరాడక తప్పదు. మళ్ళీ పోరాటం జరిగితే ఏమవుతుందో చెప్పనవసరం లేదు. 

కనుక ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కూడా పూర్తిగా తమ పంతాలను, విభేధాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయడానికి సిద్దపడితేనే ఆర్టీసీ మళ్ళీ సజావుగా సాగుతుంది లేకుంటే సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.


Related Post