పవన్‌ కల్యాణ్‌ డిల్లీకి?

November 15, 2019


img

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక సరఫరా నిలిచిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం..దానిపై ఆధారపడిన లక్షలాది నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మొదలైనవారు రోడ్డున పడ్డారు. ఈ కారణంగా ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్న సుమారు 50 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. భవన నిర్మాణ సామాగ్రి అమ్మేవారు, యంత్రాలను అద్దెలకు ఇచ్చేవారు తీవ్రంగా నష్టపోయారు. 

ఏపీ ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వపాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టబోతోంది. 

ఈ రెండు సమస్యలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి, జనసేనల మద్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో సహా వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు గుప్పించడంతో అధికార, ప్రతిపక్షాల మద్య యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. 

పవన్‌ కల్యాణ్‌ ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన ఒక బహిరంగసభలో మాట్లాడుతూ, ‘జగన్‌ ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగిస్తూ ఓవర్ యాక్షన్ చేయడం మానుకోకపోతే డిల్లీ స్థాయిలో కొందరు పెద్దలతో మాట్లాడి మీ తోకలు కత్తిరిస్తాను,” అని హెచ్చరించారు. కానీ వైసీపీ నేతలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ‘పవన్‌ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలు ఐదుగురు పిల్లలు...’ అంటూ వ్యక్తిగతస్థాయిలో విమర్శలు చేశారు. వాటికి ఆయన కూడా ధీటుగానే బదులిచ్చారు. 

పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం హటాత్తుగా డిల్లీ బయలుదేరి వెళ్లారు. బహుశః కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి ఏ‌పిలో పరిస్థితులను వివరించి జగన్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికే వెళ్ళి ఉండవచ్చునని అందరూ భావిస్తున్నారు. ఏపీ బిజెపి నేతలు ఏమైనా ఇటువంటి పిర్యాదులు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కానీ తమ పార్టీని, కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్‌ కల్యాణ్‌ పిర్యాదును కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు. దాని వలన వైసీపీకి మరింత చులకన అయ్యే అవకాశం ఉంటుంది. 


Related Post