ఆర్టీసీ నేతలతో మంత్రి హరీష్ రావుకు ఇరకాటం!

October 19, 2019


img

ఎంకి పెళ్ళి..సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఆర్టీసీ సమ్మె మంత్రి హరీష్‌రావుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తోంది. గతంలో ఆయన టిఎంయు సంఘానికి గౌరవాధ్యక్షుడుగా చేసినందున ఆయనకు ఆర్టీసీ కార్మికులు, నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా వారు ఇప్పుడు ఆయన చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టీసీ సమ్మె 15వ రోజుకు చేరుకోవడంతో హరీష్‌రావు ఇప్పటికైనా మౌనం వీడి ధైర్యంగా మాట్లాడాలని అశ్వధామరెడ్డి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల సిఎం కేసీఆర్‌ ప్రదర్శిస్తున్న నిరంకుశవైఖరిని హరీష్‌రావు ఖండించాలని, మంత్రిపదవులు శాశ్వితం కావని, ఆర్టీసీని కాపాడేందుకు ఆయన ధైర్యంగా ముందుకు వస్తే, అవసరమైతే ఆయనను మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించుకొంటామని చెపుతున్నారు. అంటే మంత్రి పదవికి రాజీనామా చేసి తమకు నాయకత్వం వహించమని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్లు భావించవచ్చు. 

ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తున్న ఈ విజ్ఞప్తిపై హరీష్‌రావు స్పందించలేదు కానీ ఇది ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుందని వేరే చెప్పకరలేదు. అటు ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తికి స్పందించలేని నిసహాయత, ఇటు పార్టీలో..ప్రభుత్వంలో అందరూ అనుమానంగా చూస్తుంటే హరీష్‌రావు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని భావించవచ్చు. 

మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ తదితరులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర విమర్శలు గుప్పించి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. దాంతో వారిపై ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక హరీష్‌రావు కూడా సిఎం కేసీఆర్‌ వైఖరిని సమర్ధిస్తూ మాట్లాడలేరిప్పుడు. కానీ ఆర్టీసీ జేఏసీ నేతలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నందున ఇంకా ఎంతో కాలం మౌనంగా ఉండటం కూడా కష్టమే. మరి హరీష్‌రావు స్పందిస్తారో లేదో చూడాలి. సానుకూలంగా స్పందిస్తే అది రాష్ట్రంలో పెద్ద సంచలనమే అవుతుంది.


Related Post