ప్రయోగశాలగా మారిన ఆంధ్రప్రదేశ్

October 18, 2019


img

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని పార్టీలకు ఒక ప్రయోగశాలగా మారిపోయింది.  అప్పటి నుంచే ఏపీ ఆర్ధికపరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. మాజీ సిఎం చంద్రబాబునాయుడు దానిని గాడిన పెట్టకపోగా భారీగా అప్పులు చేసి దుబారాఖర్చులు చేయడంతో పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది. యుద్ధప్రాతిపదికన రాజధాని నిర్మాణపనులు పూర్తి చేయవలసిన సమయంలో వాటి కోసం సింగపూర్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కాలక్షేపం చేశారు. సమయం మించిపోతున్నప్పుడు మేల్కొని వేలకోట్లు ఖర్చు చేసి తాత్కాలిక కట్టడాలను నిర్మించి చేతులు దులుపుకొన్నారు. రాష్ట్రానికి ఆదాయవనరులను సృష్టించడంలో చాలా నేర్పు ఉన్న చంద్రబాబు నాయుడు ఆ విషయంలో కూడా ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రాభివృద్ధి గురించే బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నామని పదేపదే చెప్పి, చివరికి అదే బీజేపీతో... ప్రధాని మోడీతో యుద్ధం చేస్తూ విలువన సమయాన్ని, అందివచ్చిన అవకాశాన్ని వృదా చేసుకొని ఎన్నికలలో ప్రజలచేత ఘోరంగా తిరస్కరింపబడ్డారు.     

ఆయన తరువాత చాలా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ప్రభుత్వంపై, పాలనపై పట్టు సాధించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మంచి చేసుకొనేందుకె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ గత నాలుగు నెలలుగా నిత్యం ప్రజలకు అనేక వరాలు, కొత్త సంక్షేమ పధకాలు ప్రకటిస్తూనే ఉన్నారు. వాటి వలన ప్రభుత్వంపై ఇంకా ఆర్ధికభారం పెరిగిపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఎవరైనా ఆదాయమార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ ఆదాయమార్గాన్ని చేజేతులా మూసేసుకొంటోంది. జగన్ ప్రకటిస్తున్న వరాలకు, సంక్షేమ పధకాలకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియదు కానీ ఒకపక్క ఆదాయం మార్గాలు మూసివేసుకొంటూ మరోపక్క ఖర్చులు పెంచుకుపోతుండటంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 

మరోపక్క ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం పనుల కాంట్రాక్టులను, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడంతో న్యాయవివాదాలు మొదలయ్యాయి. ఇసుక సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం పూర్తిగా చతికిలపడింది. దానిలో పనిచేస్తున్నవారు రోడ్డున పడుతున్నారు.

టిడిపి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్ ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నాయి. జగన్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహకరించిన బిజెపి కూడా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై కేంద్రప్రభుత్వ అభ్యంతరాలే అందుకు నిదర్శనం.  

కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఏపీలో ఇటువంటి విపరీత పరిస్థితులు ఏర్పడటంతో రాష్ట్ర భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితులను చూస్తున్న రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కానీ జగన్ ప్రభుత్వం అసలేమీ జరగనట్లు ‘ఆల్ ఈజ్ వెల్..’అని పాడుకొంటూ హాయిగా ముందుకు సాగిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post