టీఎస్‌ఆర్టీసీ జెఏసి నేతలు అరెస్ట్

October 18, 2019


img

అనుమతి లేకుండా బైక్ ర్యాలీలో పాల్గొనందుకు హైదరాబాద్‌ పోలీసులు టీఎస్‌ఆర్టీసీ జెఏసి కన్వీనర్ అశ్వధామరెడ్డి, రాజిరెడ్డి, వెంకన్న, వామపక్షనేతలను అరెస్ట్ చేశారు. వామపక్షాల పిలుపు మేరకు హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞానభవన్ నుంచి వామపక్ష నేతలు శ్రేణులు, టీఎస్‌ఆర్టీసీ జెఏసి, ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఉదయం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసులు వారించినప్పటికీ వారు ముందుకు సాగే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా అశ్వధామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “చర్చల ద్వారా ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని హైకోర్టు ఆదేశించడంతో మేము చర్చలకు సిద్దమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరిస్తుండటం బాధాకరం. ఇకనైనా చర్చలు మొదలుపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా సమ్మెకు మద్దతు ఇస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. పోలీసులతో అడ్డుకొని మా సమ్మెను విఫలం చేయాలనే ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించవు. మా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె చేస్తాము,” అని అన్నారు. 

నేటితో ఆర్టీసీ సమ్మె 14వ రోజుకు చేరుకొంది. ఆర్టీసీ సమ్మెపై ఈరోజు హైకోర్టులో మళ్ళీ విచారణ జరుగబోతోంది. ఈరోజులోగా ప్రభుత్వం- టీఎస్‌ఆర్టీసీ జెఏసి నేతలు చర్చలద్వారా సమస్యలను పరిష్కరించుకొని సమ్మెకు ముగింపు పలకాలని హైకోర్టు సూచించింది. కానీ గడువు ముగిసే సమయానికి సమ్మె ఇంకా ఉదృతమైంది. సమ్మెపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఆర్టీసీ జేఏసి రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు ప్రతిపక్షాలు, టీఎన్జీవోలు, విద్యార్ది సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కనుక సమ్మెపై హైకోర్టు ఏమి చెపుతుందో చూడాలి.


Related Post