ప్రధానికి యోగా నిర్వహణ గురించి వివరించారట!

October 16, 2019


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్రం నుంచి పిలుపురావడంతో మంగళవారం డిల్లీ  చేరుకొని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌లో చేపట్టిన యోగా తరగతులు, రక్తదాన శిబిరాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నివారణ తదితర అంశాల గురించి వారికి వివరించారని రాజ్‌భవన్‌ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. 

అయితే ఇటువంటి విషయాలపై చర్చించడానికి కేంద్రహోంశాఖ ఆమెను డిల్లీకి పిలిపించిందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం వైఖరి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి తెలుసుకోవడానికే ఆమెను పిలిపించి ఉండవచ్చనేది ఎవరైనా ఊహించగలరు. ఆమె ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఏమి చెప్పారనేది నేడో రేపో కేంద్రమంత్రి లేదా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ బయటపెట్టవచ్చు.  

ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున తీరు పట్ల రాష్ట్ర బిజెపి నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిజెపి మద్దతు ఇస్తోంది కనుక వారు కూడా తమ అధిష్టానానికి సిఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పిర్యాదులు చేసే ఉండవచ్చు. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకోవడానికి ఇదీ ఒక అవకాశమే కనుక ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందించబోతోందనేది చాలా ఆసక్తికరమే.


Related Post