టి-కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి ఒంటరి?

September 20, 2019


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హుజూర్‌నగర్‌ టికెట్ విషయంలో రేవంత్‌ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్య మొదలైన వివాదంలో పార్టీలో సీనియర్లు అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డికే మద్దతు తెలుపుతుండటంతో రేవంత్‌ రెడ్డి పార్టీలో ఒంటరి అయ్యారు. రేవంత్‌ రెడ్డి వైఖరిని నిన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించగా నేడు సీనియర్ నేత వి.హనుమంతరావు తప్పుపట్టారు. 

పార్టీలో కొత్తగా చేరిన రేవంత్‌ రెడ్డి కాస్త స్పీడు తగ్గించుకుంటే మంచిదని అన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రాంతీయపార్టీలకు సరిపోవచ్చు కానీ కాంగ్రెస్‌ వంటి జాతీయపార్టీకి అసలు నప్పదని అన్నారు. హుజూర్‌నగర్‌ టికెట్ విషయంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలను హనుమంతరావు తప్పు పట్టారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటించాలో తెలుసని ఆయనకు రేవంత్‌ రెడ్డి సలహా చెప్పనవసరంలేదన్నారు. యురేనియం గురించి సీనియర్ కాంగ్రెస్‌ నేత సంపత్ కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవని రేవంత్‌ రెడ్డి అనడాన్ని కూడా హనుమంతరావు తప్పు పట్టారు. రేవంత్‌ రెడ్డి అసందర్భ, అనుచిత వ్యాఖ్యల కారణంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ నేతలందరూ ఒక్క త్రాటిపైకి రావడం చాలా మంచి పరిణామమని హనుమంతరావు అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన రేవంత్‌ రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కట్టబెట్టినప్పటి నుంచే సీనియర్లలో అసంతృప్తి మొదలైందని చెప్పవచ్చు. అలాగే వివిద అంశాలపై పార్టీలో సీనియర్లు తెరాస సర్కార్‌ను నిలదీయడంలో అలసత్వం లేదా మెతక వైఖరి ప్రదర్శిస్తుండటంతో రేవంత్‌ రెడ్డి చాలా ధీటుగా, దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో బలమైన గొంతుగా గుర్తింపు సంపాదించుకున్నారు. బహుశః ఇది కూడా బహుశః పార్టీలో సీనియర్లకు నచ్చి ఉండకపోవచ్చు. 

అయితే ఈ విషయం రేవంత్‌ రెడ్డికి తెలియదనుకోలేము కానీ ఆయన తనదైన శైలిలో వ్యవహరిస్తూ, హుజూర్‌నగర్‌ టికెట్ విషయంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికే సవాలు విసరడంతో, ఒకప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా విమర్శించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సహా పార్టీలో సీనియర్లు అందరూ ఇప్పుడు ఉత్తమ్ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. దాంతో రేవంత్‌ రెడ్డి పార్టీలో ఒంటరిగా మారిపోయారు. కనుక హనుమంతరావు చెప్పినట్లుగా రేవంత్‌ రెడ్డి ఇకనైనా ‘కాంగ్రెస్‌ స్టైల్లో పనిచేయడం’ నేర్చుకుంటే ఆయనకే మంచిది లేకుంటే బిజెపి వైపు చూడవలసి రావచ్చు.


Related Post