అసెంబ్లీ ఎన్నికలకు మజ్లీస్ రెడీ

September 11, 2019


img

అసెంబ్లీ ఎన్నికలా..2023లో జరుగుతాయి కదా..మరి మజ్లీస్ రెడీ అవ్వడం ఏమిటి? అని అనుకోవద్దు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో మూడు స్థానాలకు పోటీ చేయాలని మజ్లీస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన వంచిత్ బహుజన్ అఘడి (విబిఏ)తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. విబిఏకు పట్టున్న పూణే నుంచి డేనియల్ రమేశ్ లాంగ్డే వద్గాంషెరి, మజ్లీస్‌కు పట్టున్న మాలెగావ్ సెంట్రల్ నుంచి ముఫ్తీ మహమ్మద్ ఇస్మాయిల్ అబుద్ల్ ఖాలిక్, ఉత్తర నాందేడ్ నుంచి మహమ్మద్ ఫెరోజ్ ఖాన్‌లను మజ్లీస్ అభ్యర్ధులుగా పోటీ చేస్తారని మజ్లీస్ మహారాష్ట్ర అధ్యక్షుడు సైయ్యద్ ఇంతియాజ్ జలీల్ ప్రకటించారు. 

హైదరాబాద్‌ పాతబస్తీకే పరిమితమైన మజ్లీస్ పార్టీ గత కొన్నేళ్ళుగా ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తూ పార్టీని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ దాని ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. వీలైతే తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనే ఆశలు ఉన్నట్లు మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇదివరకే బయటపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మజ్లీస్ విస్తరించేందుకు అవకాశం ఉన్నప్పటికీ తెరాసతో ఉన్న అనుబందం, అవగాహన కారణంగా అటువంటి ఆలోచనలు చేయడంలేదు. ఇటీవల ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి తన సత్తా చూపించుకోవాలని ఓవైసీ సోదరులు ఊగిసలాడారు కానీ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చేందుకుగాను వెనక్కు తగ్గారు. అయితే ఏనాటికైనా తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలనే బలమైన కోరిక ఉంది. ఆ ప్రయత్నంలోనే మహారాష్ట్రలో పోటీకి సిద్దం అవుతోందిప్పుడు.


Related Post