దారి తప్పిన దేశం...పాకిస్థాన్‌

September 10, 2019


img

పాకిస్తాన్‌ అనేకానేక సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా దేశ ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఎంతగా అంటే...పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కాన్వాయిలోని కార్లను అమ్ముకునేంత...ఇమ్రాన్ ఖాన్‌ విదేశాలకు వెళ్లవలసివస్తే తమ రాయబార కార్యాలయంలో బస చేసేంత! 

ఇటువంటి పరిస్థితులలో ఉన్న ఏ దేశాధినేతైనా తన దేశాన్ని మళ్ళీ ఏవిధంగా గాడినపెట్టుకోవాలని ఆలోచిస్తాడు కానీ పాక్‌ పాలకులు కాదు. కశ్మీర్‌ కోసం భారత్‌తో అణుయుద్ధం చేయడానికి సిద్దమని ఇమ్రాన్ ఖాన్‌ ప్రగల్భాలు పలకడమే ఒక మంచి ఉదాహరణ.   

తమ అధీనంలో ఉన్న కశ్మీర్‌ బాగోగులు చూసుకోలేకపోతున్న పాక్‌ పాలకులు, జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత్‌ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తమ దేశానికి ఏదో నష్టం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రపంచదేశాలు వారి గోడును పట్టించుకోకపోవడంతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులను సిద్దం చేస్తున్నారు. 

దానిలో భాగంగా పాక్‌ జైలులో ఉన్న జైష్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌ను రహస్యంగా విడిచిపెట్టినట్లు భారత్‌ నిఘా వర్గాలు కనుగొన్నాయి. పాక్‌ నిఘా ఏజన్సీ ఐఎస్ఐ నేతృత్వంలో వివిద ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో సమావేశమైనట్లు కూడా భారత్‌ నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఖలిస్తాన్ ఉగ్రవాదుల సహాయసహకారాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు భారత్‌ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 

జమ్ముకశ్మీర్‌ సరిహద్దులలోకి పాక్‌ సైనికులు ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. భారత్‌ దళాలు అప్రమత్తంగా ఉండి ఎదురుదాడులు చేస్తుండటంతో, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల గుండా భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని భారత్‌ నిఘావర్గాలు హెచ్చరికలతో దక్షిణాదిన సముద్రతీర రాష్ట్రాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కనుక భారత్‌కు ఉగ్రవాదదాడుల ముప్పు గతం కంటే ఇప్పుడు చాలా పెరిగిందని చెప్పవచ్చు. 

పాక్‌ ఆర్ధిక పరిస్థితులు దయనీయంగా ఉన్నప్పటికీ పాక్‌ పాలకులు భారత్‌పై దాడులకు ఎందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగకమానదు. పాక్‌ సైనికాధికారులు, ఉగ్రమూకల కనుసన్నలలో పనిచేసే పాక్‌ ప్రభుత్వం వారిని కాదని మనుగడ సాగించలేదు. అందుకే పాక్‌ ప్రధానిగా ఎవరున్నా భారత్‌ పట్ల పాక్‌ వైఖరిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. అలాగే  పాక్‌ అభివృద్ధి గురించి వారికి ఆలోచించే అవకాశం కూడా ఉండదు. అందుకే పాక్‌ పాలకులు వారి పూర్తి సమయాన్ని భారత్‌కే కేటాయిస్తున్నారనుకోవచ్చు. 


Related Post