మరి భూములు అమ్ముకోవడం దేనికి? భట్టి ప్రశ్న

September 09, 2019


img

సిఎం కేసీఆర్‌ ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సహజంగానే కాంగ్రెస్‌, బిజెపిలు తమదైన పద్దతిలో విమర్శలు గుప్పించాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ, “మిగులు బడ్జెట్‌తో చేతికి అందిన తెలంగాణ రాష్ట్రాన్ని సిఎం కేసీఆర్‌ 5 ఏళ్ళలో అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. గత ఐదేళ్ళ అనాలోచిత నిర్ణయాల దుష్పఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలను అమలుచేసేందుకు అవసరానికి మించి అప్పులు చేసి రాష్ట్ర ఆర్ధికపరిస్థితిని భూములు అమ్ముకునే స్థాయికి దిగజార్చేశారు. ఇప్పుడు తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కేంద్రాన్ని నిందిస్తూ, ఆర్ధికమాంద్యం కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని నమ్మబలుకుతున్నారు. తెలంగాణ అద్భుతంగా ప్రగతి సాధిస్తోందని గొప్పలు చెప్పుకొంటున్న సిఎం కేసీఆర్‌ మరి హైదరాబాద్‌లో భూములు ఎందుకు అమ్ముకోవాలనుకొంటున్నారు?అసలు ప్రభుత్వ భూములను అమ్ముకునే హక్కు ఆయనకు లేదు. ఇదివరకు కూడా ఇలాగే హైదరాబాద్‌లో 800 ఎకరాలు అమ్మేశారు. దానికి ఇంతవరకు లెక్కలు చెప్పనే లేదు. ఒకపక్క ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ, మరోపక్క హైదరాబాద్‌లో మిగిలిన ప్రభుత్వ భూములను కూడా అమ్మేసుకొంటున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం వలననే నేడు తెలంగాణకు ఈ దుస్థితి ఏర్పడింది. సంక్షేమ పధకాల గురించి గొప్పలు చెప్పుకున సిఎం కేసీఆర్‌ నిరుద్యోగభృతి, పంటరుణాల మాఫీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ గురించి బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదు?అప్పుడు జిఎస్టీని పొగిడిన నోటితోనే ఇప్పుడు తిడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉందో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే అర్ధం అవుతోంది,” అని విమర్శించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తన చాతగానితనానికి కేంద్రాన్ని నిందించడం, ఆర్ధికమాంద్యం పేరుతో కప్పిపుచ్చుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆర్ధిక మాంద్యం కారణంగా దేశంలోని ఆటోమోబైల్ పరిశ్రమ కుదేలయిందని, డాలరుతో రూపాయి విలువ తగ్గిపోయిందని, దేశ ఆర్ధిక పరిస్థితి బాగోలేదంటూ ఈరోజు ఆయన శాసనసభలో చేసిన బడ్జెట్‌ ప్రసంగం వింటే ఆయన ప్రవేశపెడుతున్నది రాష్ట్ర బడ్జెట్టా లేక కేంద్ర బడ్జెట్టా?అనే అనుమానం కలుగుతుంది. ఇంతకాలం రాష్ట్రం అభివృద్ధిపధంలో దూసుకుపోతోందని పదేపదే చెప్పిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు హటాత్తుగా మాట మార్చి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మిగులు రాష్ట్రంగా చేతికి అందిన తెలంగాణను సిఎం కేసీఆర్‌ తన అనాలోచిత నిర్ణయాలతో కేవలం 5 ఏళ్ళలో అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఇప్పుడు కేంద్రాన్ని నిందిస్తూ తప్పించుకోవాలనుకొంటే మేము చూస్తూ ఊరుకోము. గట్టిగా నిలదీస్తాము,” అని హెచ్చరించారు.


Related Post