నరసింహ శకం సమాప్తం..తమిళి శకం ఆరంభం!

September 07, 2019


img

సుమారు 10 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్‌కు శనివారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టులో పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన తరువాత సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిజిపి మహేందర్ రెడ్డి తదితర పోలీస్ ఉన్నతాధికారులు నరసింహన్‌ దంపతులకు పుష్పగుచ్చలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం వారిరువురూ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళిపోయారు. అంతకు ముందు సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారిరువురినీ ప్రగతి భవన్‌లో ఘనంగా సన్మానించారు.

తెలంగాణ ఉద్యమాలు జోరుగా సాగుతున్నప్పటి నుంచి క్లిష్టమైన రాష్ట్ర విభజన జరిగే వరకు, ఆ తరువాత రెండు రాష్ట్రాలు ఏర్పడి ప్రభుత్వాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు నరసింహన్‌ అనేకవిమర్శలు ఎదుర్కొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మద్య, రెండు ప్రభుత్వాల మద్య సయోద్య కుదర్చడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలు మొదట్లో ఆయనను తీవ్రంగా వ్యతిరేకించినా పదవీ విరమణ చేసేనాటికి వారి మద్య గవర్నర్-సిఎం స్థాయికి అతీతంగా బలమైన స్నేహసంబంధాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా వారిరువురి మద్య ఏనాడూ ఘర్షణ వాతావరణం ఏర్పడలేదు.

కానీ తెరాస పట్ల కేంద్రం, బిజెపి అధిష్టానం వైఖరిలో పెను మార్పు వచ్చిన తరువాత, కేంద్రప్రభుత్వం ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వంపై కత్తులు దూయవలసిన ఇబ్బందికర పరిస్థితులు ఎదురవక మునుపే ఆయన పదవీ విరమణ చేయడంతో చివరి నిమిషం వరకు ఆయనకు-సిఎం కేసీఆర్‌కు మద్య సత్సంధాలు అలాగే నిలిచాయి.

నేటితో నరసింహ శకం చాలా ప్రశాంతంగా సమాప్తమయింది. ఇక రేపటి నుంచి తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా చేసిన తమిళిసై సౌందరరాజన్ శకం ప్రారంభం కాబోతోంది. ఈ కొత్త ఇన్నింగ్స్ లో కేసీఆర్‌ ప్రభుత్వం ఏవిధంగా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి.


Related Post