యాదాద్రి స్తంభాలపై కేసీఆర్‌, కారు బొమ్మలు!

September 06, 2019


img

ఒకప్పుడు దేశాన్ని చక్రవర్తులు, రాజులు పరిపాలించేటప్పుడు అప్పటి పరిస్థితులను అద్దం పట్టే శిలాశాసనాలు, తమ గొప్పదనం గురించి తెలుపుకునేందుకు తమ బొమ్మలను ఆలయాలపై, విజయ స్థూపాలపై చెక్కించుకునేవారు. ఆ సంప్రదాయం మళ్ళీ ఇప్పుడు యాదాద్రి ఆలయంలో మొదలుకాబోతోంది. 

ఆలయంలోని అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను, ఆటపాటలను, పండుగలను, కళారూపాలను, నాగలి పట్టిన రైతు, రాష్ట్ర ప్రభుత్వం ముద్ర, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయపక్షి నెమలి, నాణేల బొమ్మలను చెక్కుతున్నారు. తెలంగాణ చరిత్రను, తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాలను తెలియజేసే బొమ్మలను కూడా చెక్కుతున్నారు. వాటికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ మండపంలో బాలపాద స్తంభాలపై సిఎం కేసీఆర్‌ బొమ్మను, తెరాస ఎన్నికల గుర్తు కారు బొమ్మను, తెరాస సర్కార్‌ అమలుచేస్తున్న కేసీఆర్‌ కిట్ వంటి సంక్షేమ పధకాల బొమ్మలను కూడా చెక్కుతున్నారు. అవే వివాదాస్పదమయ్యాయి ఇప్పుడు. 

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై స్పందిస్తూ, “దేశంలో అనేకమంది అనేక ఆలయాలు కట్టించారు కానీ ఎవరూ వాటిపై తమ బొమ్మలు చెక్కించుకోలేదు. కానీ ప్రజాధనంతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న సిఎం కేసీఆర్‌ తన బొమ్మలు, తన పార్టీ గుర్తు బొమ్మలు చెక్కించుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆధ్యాత్మికత వెల్లివిరిసే  ఆలయాలలో రాజకీయ గుర్తులు దేనికి? సిఎం కేసీఆర్‌ యాదాద్రిని తన సొంత డబ్బుతో ఏమీ నిర్మించడం లేదు కదా? ప్రజాధనంతో నిర్మిస్తున్నప్పుడు తన బొమ్మ చెక్కించుకోవడం ఏమిటి? ఇది చాలా తప్పు. కనుక వాటిని తక్షణం తొలగించమని కేసీఆర్‌ ఆదేశించాలి. వాటిని ఎవరి ఆదేశాలతో చెక్కారో ప్రజలకు తెలియజేయాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే మేము రంగంలో దిగవలసి ఉంటుంది,” అని హెచ్చరించారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇద్దరూ కూడా దీనిని ఖండించారు. సిఎం కేసీఆర్‌ రాచరికపోకడలకు ఇదొక తాజా నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తోందని రాజరిక వ్యవస్థకాదని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావు లేదని అన్నారు. ఆలయ స్తంభాలపై కేసీఆర్‌, కారు, సంక్షేమ పధకాల బొమ్మలను చెక్కాలని ఎవరు ఆదేశించారో చెప్పాలని డిమాండ్ చేశారు.


Related Post