సచివాలయం కూల్చుడే...పక్కా!

September 06, 2019


img

సచివాలయం కూల్చివేయాలని సిఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్న తరువాత వేసిన కేబినెట్ సబ్ కమిటీ అందుకు భిన్నంగా నివేదిక ఇస్తుందని ఎవరూ అనుకోలేరు. ఊహించినట్లుగానే అది సచివాలయం కూల్చివేయడమే మంచిదని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అత్యాధునిక హంగులు, వసతులతో కొత్త సచివాలయం కడుతున్నప్పుడు పాత సచివాలయంలోని కొన్ని భవనాలు ఇంకా దృడంగా ఉన్నాయనే కారణంతో వినియోగించుకోదలిస్తే ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత సచివాలయంలోని ఏ-డి, జి-కె బ్లాకులలో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకోలేని విధంగా వాటి నిర్మాణాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. 

ప్రస్తుత సచివాలయంలో ఉద్యోగులు, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఒకే ద్వారం గుండా రాకపోకలు సాగించవలసివస్తోందని దాని వలన విఐపి, వివిఐపిల భద్రత ఉండదని నివేదికలో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వానికి సంబందించిన కీలక ఉత్తర్వుల పత్రాలు, రహస్య డాక్యుమెంట్లకు ప్రస్తుత సచివాలయంలో భద్రత, గోప్యనీయతలేదని పేర్కొన్నారు. 

కారణాలు ఏవైతేనేమీ సచివాలయం కూల్చేయడమే ఉత్తమం అని నివేదికలో పేర్కొన్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే సచివాలయం దాదాపు ఖాళీ అయిపోయింది.  హైకోర్టుకు ఈ నివేదిక చూపించి ఒప్పించుకోగలిగితే ఇక కూల్చుడు కార్యక్రమం మొదలుపెట్టేయవచ్చు. ఆ పని పూర్తయ్యేలోగా కొత్త సచివాలయం డిజైన్లు కూడా సిద్దం అవుతాయి. కొత్త సచివాలయానికి సిఎం కేసీఆర్‌ నెలరోజుల క్రితమే శంఖుస్థాపన కూడా చేసేశారు. కనుక మంచిరోజు చూసి నిర్మాణపనులు కూడా మొదలుపెట్టేయవచ్చు.


Related Post