తెరాస ఇప్పుడు కాంగ్రెస్‌ భజన చేస్తోందేమిటి?

August 29, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత విజయశాంతి రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేసి తమకు తిరుగేలేదని జబ్బలు చరుచుకొంటున్న తెరాసకు బిజెపి ఎంట్రీతో షాక్ అయ్యిందని అన్నారు. అందుకే తెరాస మళ్ళీ కాంగ్రెస్‌ భజన మొదలుపెట్టిందని విజయశాంతి అన్నారు. బిజెపి ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకున్న తెరాస అధిష్టానం, ఇప్పుడు అదే బిజెపి తమకు పక్కలో బల్లెంలా మారడంతో దాని ప్రాధాన్యత తగ్గించడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే తెరాసకు ప్రత్యామ్నాయమన్నట్లు మాట్లాడుతోందని విజయశాంతి ఎద్దేవా చేశారు. 

బిజెపి ఎంట్రీ తరువాత తెరాస అధిష్టానం మైండ్‌సెట్‌లో చాలా మార్పు కనబడుతోందని ఆ పార్టీ నేతల ద్వారానే తనకు తెలిసిందని విజయశాంతి అన్నారు. అయితే నేటికీ తెరాస, బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని నమ్ముతున్నానని ఆమె అన్నారు. అందుకే రాష్ట్ర బిజెపి నేతలు తెరాస సర్కార్‌పై ఎన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇది తప్పనుకుంటే రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రప్రభుత్వంతో మాట్లాడి తెరాస సర్కార్‌పై అవినీతిపై విచారణ జరిపించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.  

కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేస్తే రాష్ట్రంలో తమకు ఇక తిరుగు ఉండదని తెరాస అధిష్టానం భావించిన మాట వాస్తవం. అయితే అదే పెద్ద తప్పని ఇప్పుడు మెల్లగా అర్ధం అవుతోంది. కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్నంత తేలికగా అధికారంలో ఉన్న బిజెపిని ఎదుర్కోవడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలంగా నిలబడి ఉండటం కాంగ్రెస్ పార్టీ కంటే తెరాసకే చాలా ముఖ్యమని ఇప్పుడు అర్ధమవుతోంది. 

తెరాస అధిష్టానం కూడా ఈ విషయం గుర్తించింది గాబట్టే ఇప్పుడు అది కాంగ్రెస్ నేతలను ఫిరాయింపజేసుకునే ప్రయత్నాలు విరమించుకుని ఉండవచ్చు. కానీ ఇప్పటికే చాలా ఆలశ్యమైపోయింది. బిజెపికి ప్రజాధారణ లభిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే, తెరాస కల్పించిన ఈ అవకాశాన్ని బిజెపి బాగానే ఉపయోగించుకొని అతి తక్కువ సమయంలోనే తెరాసకు ప్రత్యామ్నాయమని ప్రజలు కూడా భావించే స్థాయికి ఎదిగింది. కనుక కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ అని తెరాస చెప్పుకున్నప్పటికీ అసలు పోటీ బిజెపితోనేనని చెప్పక తప్పదు.



Related Post