బిజెపి కూడా అదే చేస్తోంది కదా?

August 29, 2019


img

సెప్టెంబర్ నెల వస్తోందంటే రాష్ట్ర బిజెపి నేతలు తెరాస సర్కార్‌ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపకపోవడం గురించి మాట్లాడుతూ విమర్శలు గుప్పిస్తుంటారు. మజ్లీస్ అధినేతలకు భయపడే సిఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని ఆరోపిస్తుంటారు. సిఎం కేసీఆర్‌ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తుంటారు. కనుక రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని చెపుతుంటారు.

తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణ విషయంలో సిఎం కేసీఆర్‌ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని వాదిస్తున్న బిజెపి కూడా ఈ అంశంపై గత ఐదేళ్ళుగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూనే ఉంది. కానీ ఈవిషయంలో బిజెపి వాదనలను మెచ్చి రాష్ట్రంలో హిందువులు అందరూ గంపగుత్తగా ఆ పార్టీకే ఓట్లేయడంలేదనే సంగతి ప్రతీ ఎన్నికలలో నిరూపితమవుతూనే ఉంది. మరి అయితే బిజెపి దీనిని ఎందుకు విడిచిపెట్టడం లేదు అంటే సిఎం కేసీఆర్‌ను విమర్శించేందుకు, తద్వారా తెరాస వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు ఇదొక అస్త్రంగా ఉపయోగపడుతోంది కనుకనే అని చెప్పవచ్చు. అంటే బిజెపి కూడా దీంతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని అర్ధమవుతోంది.


Related Post