పాపం పాకిస్తాన్...పీఎంఓకి పవర్ కట్!

August 29, 2019


img

కశ్మీర్‌ విషయంలో పాక్‌ ఆక్రోశం అరణ్యరోదనగా మారడంతో ఏమి చేయాలో పాక్‌ పాలకులకు పాలుపోవడం లేదు. అందుకే రకరకాల కోతి చేష్టలు చేస్తూ దేశప్రజల ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే తమ చర్యలపై పాక్‌ ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా సానుకూలంగా స్పందించకపోగా ఇంకా చులకనగా మాట్లాడుతున్నారని గ్రహించిన పాక్‌ పాలకులు ఇప్పుడు ‘అక్టోబరులో భారత్‌తో అణుయుద్ధం’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలను మభ్యపెట్టేందుకు ఆవిధంగా మాట్లాడుతున్నారనుకునే అవకాశం ఉంది కనుక పాక్‌ ప్రభుత్వం క్షిపణి ప్రయోగానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. అందుకుగాను పాక్‌ ప్రభుత్వం బుదవారం ‘నోటీస్ టు ఎయిర్‌మెన్’ అనే హెచ్చరికను జారీ చేసినట్లు తెలుస్తోంది. కరాచీ సమీపంలోని సోన్మియా పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుపవచ్చని సమాచారం. తద్వారా ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వానికి అంతర్గతంగా ఎదురవుతున్న వ్యతిరేకతను కొంతమేర తగ్గించుకోవడమే కాకుండా ఐక్యరాజ్యసమితిని, అగ్రరాజ్యాల దృష్టిని ఆకర్షించవచ్చని పాక్‌ ఆలోచన కావచ్చు. 

అయితే క్షిపణి ప్రయోగం గురించి ఆలోచిస్తున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాక్‌ ప్రధాని కార్యాలయం రూ.41 లక్షలు విద్యుత్ బకాయిలు చెల్లించవలసి ఉన్నందున తక్షణమే చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ రెండు రోజుల క్రితమే నోటీసులు పంపించినట్లు సమాచారం! కనుక ముందుగా ప్రధాని కార్యాలయంలో కరెంటు పోకుండా చూసుకొంటే ఆ తరువాత క్షిపణి ప్రయోగం గురించి ఆలోచించవచ్చని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. 

భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడిని చేరుకోబోతుంటే, పాకిస్థాన్‌ మాత్రం క్షిపణి ప్రయోగాలతో ప్రజలను సంతృప్తిపరచాలని చూస్తోంది. కానీ పాక్‌ ఆర్ధికవ్యవస్థ దానినైనా భరించగలదో లేదో చూడాలి.




Related Post