సింగరేణి ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరు గెలుస్తారో?

August 28, 2019


img

రెండేళ్ల క్రితం జరిగిన సింగరేణి బొగ్గుగనుల కార్మిక సంఘాల ఎన్నికలలో అధికార తెరాసకు అనుబంద సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిబిజికెఎస్) విజయం సాధించింది. దానికి గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన మాజీ ఎంపీ కవిత స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని సింగరేణి కార్మికులకు అనేక వరాలు గుప్పించారు. టిబిజికెఎస్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబరుతో ముగిసిపోతుంది. కనుక అంతకంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. 

గత ఎన్నికలలో సింగరేణి కార్మికులకు కవిత ఆమె తరపున సిఎం కేసీఆర్‌ ఇచ్చిన అనేక హామీల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎంతగా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఈసారి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడి ఉంది కనుక అక్కడ కూడా బిజెపి తన సత్తాను చాటుకునేందుకు సిద్దం అవుతోంది. 

లోక్‌సభ ఎన్నికలలో బిజెపి గాలివాటంగా రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొందని తెరాస నేతలు పదేపదే ఎద్దేవా చేస్తున్నందున, ఈసారి సింగరేణి ఎన్నికలలో అనుబంద కార్మికసంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్)ను గెలిపించుకొని తమ సత్తా చాటాలని బిజెపి, బిఎంఎస్ నేతలు సిద్దం అవుతున్నారు. వారసత్వ ఉద్యోగాల కల్పనతో సహా పలు హామీల అమలులో తెరాస ప్రభుత్వం వైఫల్యం, దానిపై ఒత్తిడి తేవడంలో టిబిజికెఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా సింగరేణి కార్మికులను తమవైపు తిప్పుకోవాలని వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో మారిన రాజకీయ బలాబలాలు కూడా తమకు అనుకూలంగా మారిందని బిజెపి నేతలు భావిస్తున్నారు. 

సింగరేణి గనులు పెద్దపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఇటీవల బిజెపిలో చేరిన పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు ఆ ప్రాంతాలలో మంచి పట్టుంది కనుక ఆయనకు ఈ బాధ్యతను అప్పగించబోతునట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికలలో 7 సీట్లు గెలుచుకొని విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌, బిజెపిలను ఈ సింగరేణి ఎన్నికలలో ఓడించడం ద్వారా వాటిది గాలివాటపు గెలుపేననే తమ వాదనను నిరూపించుకోవాలని తెరాస పట్టుదలగా ఉంది. అయితే సింగరేణి కార్మికసంఘం పదవీకాలాన్ని నాలుగేళ్ళ నుంచి రెండేళ్లకు తగ్గించడాన్ని సవాలుచేస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారిస్తోంది కనుక అది తేలేవరకు ఎన్నికలు ఉండకపోవచ్చునని టిబిజికెఎస్ అధ్యక్షుడు ఎం.రాజిరెడ్డి అన్నారు. ఒకవేళ సింగరేణి యాజమాన్యం అక్టోబరులోనే ఎన్నికలు నిర్వహిచాలనుకున్నా తాము సిద్దంగానే ఉన్నామని తెలిపారు.


Related Post