తెలంగాణలో ఒక్కటే సెంటిమెంట్.. అది కేసీఆర్‌: తెరాస

August 24, 2019


img

రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్థానంలోకి ప్రవేశించిన బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుండటంతో తెరాస కూడా తప్పనిసరిగా వారితో కత్తులు దూయవలసివస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేస్తున్న విమర్శలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంతే ఘాటుగా బదులిచ్చారు. 

శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఒక పక్క ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని పొగుడుతుంటారు. మిషన్ భగీరధ, కాకతీయ పధకాలు దేశానికే ఆదర్శమని చెపుతుంటారు. రాష్ట్రంలో అమలవుతున అనేక సంక్షేమ పధకాలకు, అభివృధి పనులకు కేంద్రప్రభుత్వమే మంచి ర్యాంకులు, అవార్డులు ఇస్తుంటుంది. కానీ రాష్ట్రంలో బిజెపి నేతలు అవే పనులు, పధకాలలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగిపోతున్నాయని నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. అంటే కేంద్రప్రభుత్వం చెపుతున్న మాటలు అబద్దమని వారి అభిప్రాయమా?” అని ప్రశ్నించారు. 

బిజెపి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తోంది. అటువంటి సెంటిమెంట్లు ఉత్తర భారత్‌లో పనిచేస్తాయేమో కానీ దక్షిణాది రాష్ట్రాలలో సాధ్యం కాదు. ముఖ్యంగా తెలంగాణలో అసలే సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పధంలో నడిపిస్తున్న కారణంగా రాష్ట్రంలో కేసీఆర్‌ సెంటిమెంటు తప్ప మరే సెంటిమెంటు పనిచేయదని రాష్ట్ర బిజెపి నేతలు గ్రహిస్తే మంచిది. మా ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తోంది. కానీ రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రానికి ఏమి సాయం చేశారో చెప్పగలరా? బిజెపి బలం ఏపాటిదో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలోనే తేలిపోయింది. కానీ రోజూ కేసీఆర్‌ను, కేటీఆర్‌ను విమర్శిస్తుంటే రాష్ట్రంలో బిజెపి బలపడుతుందనుకొంటున్నారు. అది వారి భ్రమ. దాని వలన రాష్ట్రంలో ప్రజలు బిజెపికి  ఇంకా దూరం అవుతారని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.


Related Post