ఓటమి భయంతోనే కుట్రలు: తెరాస

August 23, 2019


img

తెరాస సభ్యత్వ నమోదు ముగిసిన సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు గాలివాటంగానే 7 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి తప్ప అవి చెప్పుకొంటున్నట్లు ప్రజాధారణ పెరిగినందున కాదు. రాష్ట్రంలో 60 లక్షల మంది ప్రజలు తెరాసలో చేరారంటే దానర్ధం ప్రజలు మనవైపే ఉన్నారని. అందుకే మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తే తెరాస చేతిలో ఓడిపోతామనే భయంతో ఆ రెండు పార్టీలు ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు మనం సిద్దంగానే ఉన్నాము,” అని అన్నారు.

తెరాస సభ్యత్వాలతో పోలిస్తే బిజెపి చాలా వెనుకబడి ఉందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తారు. బిజెపి నేతలు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ, తెలంగాణ ప్రజలు తెరాసను కాదని బిజెపిని ఎందుకు ఆదరించాలో చెప్పలేకపోతున్నారు. వారు ఎంతసేపు మోడీని కీర్తించడం, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి మాట్లాడేందుకు సాహసించలేకపోతున్నారు. ఎంతసేపు రాష్ట్రంలో ఏవిధంగా అధికారంలోకి రావాలా అనే ఆలోచనలే తప్ప కేంద్రప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి ఏమి సాధించగలమని ఆలోచించకపోవడం చేత ప్రజలు బిజెపిని విశ్వసించలేకపోతున్నారని చెప్పవచ్చు. 

లోక్‌సభ ఎన్నికలలో తెరాస ఓటమిని కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్‌, బిజెపిలు గాలివాటంగా గెలిచాయనే వాదన చేస్తోంది తప్ప అందులో నిజం లేదని అందరికీ తెలుసు. తాము గెలిస్తే ప్రజలు మావైపున్నారని ప్రతిపక్షాలు గెలిస్తే గాలివాటంగా గెలిచాయని చెప్పుకోవడం తెరాసకే చెల్లు. 

లోక్‌సభ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్‌, బిజెపిల ఆత్మవిశ్వాసం పెరిగిన మాట వాస్తవమే కానీ మున్సిపల్ ఎన్నికలలో గెలిచే అంత కాదని చెప్పక తప్పదు. ‘మా లక్ష్యం మున్సిపల్ ఎన్నికలు కాదు 2023 అసెంబ్లీ ఎన్నికలని,’  కిషన్‌రెడ్డి అన్న మాటలే అందుకు నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల గురించి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎవరూ మాట్లాడకపోవడం గమనిస్తే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆ పార్టీ సిద్దంగా లేదనిపిస్తోంది.    

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో అవకతవకలపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుంటే, ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post