బిజెపి ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకుందా?

August 21, 2019


img

రాష్ట్రంలో తెరాసకు మేమే ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకొంటున్న బిజెపి నేతలకు తమ సత్తాను నిరూపించి చూపుకునేందుకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేస్తారనుకోవడం సహజం. కానీ మున్సిపల్ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటంతో తెరాసను డ్డీకొనేందుకు బిజెపి ఇంకా సిద్దం కాలేదని స్పష్టం అయ్యింది. 

సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అవుట్ పేషెంట్ బ్లాక్‌కు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ లక్ష్యం మున్సిపల్ ఎన్నికలు కాదు. 2023లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం,” అని అన్నారు. 

అంటే ఎన్నికలకు ముందే బిజెపి ఓటమిని అంగీకరించి బరిలో నుంచి తప్పుకొన్నట్లయింది. కిషన్‌రెడ్డి చేసిన ఈ తాజా ప్రకటనతో తెరాస, కాంగ్రెస్ పార్టీలకు ఆయుధం అందించినట్లయింది. అంతేకాదు...లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఏదో గాలివాటంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొంది తప్ప దానికి రాష్ట్రంలో బలం లేదని కావాలంటే మున్సిపల్ ఎన్నికలలో తేల్చుకొందామని కాంగ్రెస్‌, తెరాసలు బిజెపికి సవాలు విసురుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు తమ లక్ష్యం కాదని కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన వారి వాదనలను అంగీకరిస్తునట్లుంది.


Related Post