కేసీఆర్‌జీ..నిరుద్యోగ భృతి ఇంకా ఎప్పుడు?

August 17, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ చాలా రోజుల తరువాత శనివారం మీడియా ముందుకు వచ్చారు. “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ నెలకు రూ. రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినప్పుడు, కేటీఆర్‌ మా హామీని ఎద్దేవా చేశారు. కానీ తెరాస దానికే మరో రూ.16లు చేర్చి తాము అధికారంలోకి వస్తే రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. తెరాస అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇంతకీ నిరుద్యోగభృతి ఇస్తారా లేదా? ఇవ్వాలనుకుంటే ఇంకా ఎప్పుడు ఇస్తారు?” అని ప్రశ్నించారు. 

ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా తాత్సారం జరుగుతోంది. ఒకవేళ నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్షలు నిర్వహించినా నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు నమ్మకం ఉండదు. ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించడంతో ఉద్యోగాల భర్తీ నిలిచిపోవడం, న్యాయవివాదాలు ఏళ్లతరబడి సాగడం, ఎంపికైన అభ్యర్ధులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జరుగుతున్న ఈ ఆలస్యం కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కుటుంభాన్ని పోషించవలసిన వయసులో తమ రోజువారీ ఖర్చుల కోసం తల్లితండ్రులపై ఆధారపడవలసి రావడం ఎంత బాధాకరమో వారికే తెలుసు. కనుక ఉద్యోగాలు రాకపోయినా కనీసం నిరుద్యోగభృతి అయినా లభిస్తుందనే ఆశతో వారందరూ ఎదురుచూపులు చూస్తున్నారు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ కూడా నిరుద్యోగ భృతి హామీపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు!


Related Post