తెరాస ఎంపీల సంఖ్య తగ్గింది కనుక...

July 20, 2019


img

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా గత లోక్‌సభలో తెరాసకు 13మంది ఎంపీలు ఉండేవారు. కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టిడిపి ఎంపీ మల్లారెడ్డి కూడా తెరాసలో చేరిపోవడంతో వారి సంఖ్య 15కు చేరింది. కనుక లోక్‌సభలో తెరాస ఎంపీల గొంతు గట్టిగానే వినబడేది. వారందరూ ఒకే పార్టీకి చెందినవారైనందున లోక్‌సభలో..డిల్లీలో తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా వాదనలు వినిపించేవారు. అందరూ కలిసికట్టుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టులకు అనుమతులు, రాష్ట్రానికి నిధులు సాధించుకునేందుకు గట్టిగా ప్రయత్నించేవారు. ఆ సమయంలో కేసీఆర్‌- ప్రధాని నరేంద్రమోడీ మద్య మంచి దోస్తీ కూడా కొనసాగుతుండటంత డిల్లీలో తెరాసకు, తెలంగాణకు అంతా అనుకూలవాతావరణమే కనిపించేది. 

కానీ 2019 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రం నుంచి నలుగురు బిజెపి, ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు ఎన్నికవడంతో లోక్‌సభలో తెరాస ఎంపీల సంఖ్య తగ్గింది. ఆ కారణంగా లోక్‌సభలో ఇదివరకులా వారి గొంతు వినబడటం లేదు. పైగా కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు తెరాస సర్కారుకు వ్యతిరేకంగా తమతమ వాదనలు వినిపిస్తుండటంతో తెరాసకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 

ఇక కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు రాష్ట్రానికి రావలసిన నిధులు, అనుమతుల కోసం కేంద్రప్రభుత్వంతో పోరాడుతామని చెపుతున్నప్పటికీ, వారు తమ తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించవలసి ఉంటుంది కనుక తెరాసకు మంచిపేరు, రాజకీయలబ్ది కలిగే ఏ పని చేయకపోవచ్చు. కనుక నిధుల కోసం వారు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా ప్రయోజనం కూడా ఉండదనే చెప్పవచ్చు. కాంగ్రెస్‌ ఎంపీల అభ్యర్ధనలను మోడీ సర్కార్ పట్టించుకోదనేది బహిరంగ రహస్యం. తెరాస పట్ల బిజెపి వైఖరి మారింది కనుక తెలంగాణ బిజెపి ఎంపీల సిఫార్సులను మోడీ సర్కార్ పట్టించుకోకవచ్చు. అంటే ఈసారి తెరాస ఎంపీల సంఖ్య తగ్గడం వలన తెలంగాణ రాష్ట్రంపై ఆ ప్రభావం ఎంతో కొంత పడే అవకాశం కనిపిస్తోంది.


Related Post