హరీష్‌రావుపై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు

July 20, 2019


img

మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్‌ రెడ్డికి శుక్రవారం కొస్గీలో పార్టీ నాయకులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పొట్టోన్ని పొడుగోడు కొడితే... పొడుగోన్ని పోశమ్మ కొట్టిందన్నట్లు, కొడంగల్ అసెంబ్లీ ఎన్నికలలో నన్ను దెబ్బ తీసిన హరీష్‌రావు పరిస్థితి ఇప్పుడు ఏమయిందో అందరూ చూస్తున్నారు. ప్రశ్నించే గొంతు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు. కనుక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను పోరాడుతూనే ఉంటాను. ఎంపీగా నేను రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడటం ఖాయం,” అని అన్నారు.

గత ప్రభుత్వంలో సాగునీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్‌రావు సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణలో ఎదురైన అనేక ఇబ్బందులను ఎంతో ఓపికగా పరిష్కరించి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. గత ఐదున్నరేళ్ళలో రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికలలో తెరాసను గెలిపించుకోవడంలో చాలా కీలకపాత్ర పోషించారు. కొడంగల్లో రేవంత్‌ రెడ్డిని ఓడించడమంటే మామూలు విషయం కాదు. కానీ తాను హరీష్‌రావు కారణంగానే ఓడిపోయానని స్వయంగా రేవంత్‌ రెడ్డి చెప్పుకున్నారంటే హరీష్‌రావు రాజకీయ చతురత, శక్తి సామర్ధ్యాలు ఎంత గొప్పవో అర్ధం చేసుకోవచ్చు. ఇంత గొప్ప కార్యదక్షుడు, గొప్ప రాజకీయవేత్త అయిన హరీష్‌రావును సిఎం కేసీఆర్‌ ఎందుకు పక్కనపెట్టడం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయినప్పటికీ హరీష్‌రావు ఏనాడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. సిఎం కేసీఆర్‌ పట్ల విధేయంగానే వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ‘పదవులలో ఉన్నప్పుడే కాదు...లేనప్పుడు కూడా ప్రజల మద్యన ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాడే నిజమైన రాజకీయ నాయకుడు’ అన్న ఆయన మాటలు నూటికి నూరు శాతం నిజం. మంత్రివర్గ విస్తరణలో సిఎం కేసీఆర్‌ ఆయనకు సముచిత స్థానం కల్పించాలని ప్రజలు కూడా కోరుకొంటున్నారు.     


Related Post