రాజగోపాల్ రెడ్డికి బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా?

July 16, 2019


img

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించి అప్పుడే మూడు వారాలపైనే అవుతోంది కానీ ఇంతవరకు ఆయన బిజెపిలో చేరలేదు. ఆయన పార్టీ మారుతున్నట్లు తెలియగానే కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ పంపించింది కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఆయనను చేచేర్చుకునేందుకు బిజెపి వెనకాడుతోందా? ఆయన తిరిగి వస్తారనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆయనపై చర్యలు తీసుకోలేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నేతలను సైతం చేర్చుకోవడానికి తహతహలాడుతున్న బిజెపి, నల్గొండ జిల్లాలో మంచి పట్టు, పేరున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి అగ్రనేతను చేర్చుకోవడానికి వెనకాడుతోందనుకోలేము. కానీ కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఇంతవరకు కలిసే రాజకీయాలు చేశారు. కనుక ఒకరు కాంగ్రెస్‌లో, మరొకరు బిజెపిలో ఉండటం వలన ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వారిరువురూ బిజెపిలోకి వచ్చినట్లయితే నల్గొండ జిల్లాలో బిజెపి చాలా బలపడి తెరాసను సవాలు చేయగలిగే స్థాయికి ఎదుగుతుంది. కనుక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా పార్టీలోకి రప్పించాలని బిజెపి అధిష్టానం భావించడం సహజం. బహుశః అందుకే రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిక వాయిదా పడుతోందేమో?అయితే తుదిశ్వాస విడిచేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెపుతున్నారు. కనుక ఆయనను బిజెపిలోకి రప్పించాలంటే, పార్టీలో లేదా ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి ఆఫర్ చేయవలసి ఉంటుంది. బహుశః తెర వెనుక ఆ దిశలో చర్చలేమైనా నడుస్తున్నాయేమో? 

ఇదే సమయంలో...కాంగ్రెస్ పార్టీ కూడా కోమటిరెడ్డి సోదరులు చేజారిపోకుండా కాపాడుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తుండవచ్చు. వెంకట్‌రెడ్డిని బిజెపిలోకి వెళ్లిపోకుండా నిలుపుకోవడంతో పాటు రాజగోపాల్ రెడ్డిని వెనక్కు రప్పించుకోవడం కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చిరకాలవాంఛ అయిన పిసిసి అధ్యక్ష పదవిని ఆఫర్ చేయవచ్చు. కనుక కోమటిరెడ్డి సోదరులిద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా బిజెపిలోకి మారుతారా? అనేది చూడాలి.


Related Post