కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి: బిజెపి

July 15, 2019


img

అవును! కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరింది బిజెపియే! తెరాస నేతలు కాదు. ఆశ్చర్యంగా ఉందా? ఇది నిజమే కానీ బిజెపి ఏ ఉద్దేశ్యంతో ఈ సూచన చేసిందో వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆదివారం జగిత్యాలలో బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకే వాస్తుపేరిట సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయం కట్టాలనుకొంటున్నారు. ఒకవేళ కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉన్నట్లయితే అదేదో వెంటనే తీర్చుకుంటే మంచిది లేకుంటే భవిష్యత్‌లో అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి 100 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోంది. కనుక కేటీఆర్‌ తన ముచ్చట ఇప్పుడే తీర్చుకుంటే మంచిది,” అని అన్నారు. 

కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని బిజెపి నేతలు ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ ఏదో ఒక రోజు కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారనే విషయం అందరికీ తెలుసు. నిజానికి సిఎం కేసీఆర్‌ ఊహించినట్లుగా లోక్‌సభ ఫలితాలు వచ్చి ఉంటే, ఆయన జాతీయరాజకీయాలలో పాల్గొనేందుకు డిల్లీకి వెళ్ళి ఉండేవారు ఆయన స్థానంలో కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండేవారు. కానీ ఆవిధంగా జరుగలేదు పైగా ఇప్పుడు తెలంగాణతో సహా దేశంలోని బిజెపియేతర ప్రభుత్వాల తలమీద బిజెపి కత్తిలా వ్రేలాడుతోంది కనుక మరింత అప్రమత్తంగా ఉండాలి. కనుక మరొక రెండుమూడేళ్ళవరకు సిఎం కేసీఆర్‌ అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయకపోవచ్చు.


Related Post