తెలంగాణలో బిజెపికి అంత సీన్ లేదు: తెరాస

July 12, 2019


img

లోక్‌సభ ఎన్నికల తరువాత తెలంగాణలో బిజెపి నేతలు స్వరం పెంచి తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తూ సవాళ్ళు విసురుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో హటాత్తుగా పెరిగిన వారి దూకుడు గురించి సిఎం కేసీఆర్‌తో తెరాస నేతలు చర్చించినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో నాలుగు సీట్లు గెలుచుకోగానే వారు వాపును చూసి బలుపు అనుకొంటున్నారని, రాష్ట్రంలో బిజెపికి క్యాడర్ కానీ ప్రజల మద్దతు గానీ లేదని కనుక వారిని పట్టించుకోనవసరం లేదని సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఇకపై వారు తెరాస ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తే మాత్రం వాటిని ధీటుగా తిప్పికొట్టాలని సిఎం కేసీఆర్‌ తెరాస నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మిగిలిన ఈ నాలుగేన్నరేళ్ళలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసుకొంటూ, ప్రజలకు చక్కటి పరిపాలన అందించడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకొందామని, అప్పుడు బిజెపి సంగతి ప్రజలే చూసుకొంటారని సిఎం కేసీఆర్‌ తెరాస నేతలకు చెప్పినట్లు సమాచారం. 

తెలంగాణలో... ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఒకప్పుడు బిజెపికి మంచి పట్టు ఉన్న మాట వాస్తవం. అయితే గ్రేటర్ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి రాష్ట్రంలో బిజెపి మెల్లగా తనపట్టు కోల్పోయింది. శాసనసభ, పరిషత్ ఎన్నికల ఫలితాలే అందుకు చక్కటి ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 4 సీట్లు గెలుచుకోవడం అనూహ్య పరిణామంగానే చూడాలి తప్ప బిజెపి బలం పెరిగినందున అని అనుకోలేము. ఒకవేళ పెరిగిందని బిజెపి భావిస్తే త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించి చూపాల్సి ఉంటుంది. తెరాసకు అపూర్వమైన ప్రజాధారణ ఉన్నందున, రాష్ట్రంలో బిజెపి అధికారం చేజిక్కించుకోవాలంటే కర్ణాటకలాగ దొడ్డిదారిన రావలసిందే తప్ప నేరుగా ఎన్నికలలో గెలిచిరావడం కష్టమేనని భావించవచ్చు.      

బిజెపి నేతల విమర్శలను ఇప్పటికే తెరాస నేతలు బలంగా తిప్పికొడుతున్నారు. హైదరాబాద్‌ గురించి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను, తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వీధిపోరాటాలు చేయాలన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలపై తెరాస నేతలు చాలా ఘాటుగా జవాబులు చెప్పారు. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ కూడా అనుమతించినందున తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు బిజెపిని మరింత చురుకుగా, ధీటుగా ఎదుర్కోవడం తధ్యం. 


Related Post