సుప్రీంకోర్టు ఆదేశాలతో సంక్షోభం ముగుస్తుందా?

July 11, 2019


img

కర్ణాటక తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈరోజు (గురువారం) సాయంత్రం 6గంటల లోపుగా స్పీకరు ముందు హాజరయ్యి తమ రాజీనామాల విషయం తేల్చుకోవాలని ఆదేశించింది. వారి రాజీనామాల వ్యవహారంపై శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని, స్పీకరును కూడా ఆదేశించింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. దీంతో వారం రోజులుగా సాగుతున్న ఈ దాగుడుమూతలకు నేడు ముగింపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని 11 మంది కాంగ్రెస్‌, 2 జెడిఎస్ ఎమ్మెల్యేలు సుమారు వారం రోజుల క్రితం తమ రాజీనామాపత్రాలను స్పీకరు కార్యదర్శికి ఇచ్చి ముంబై వెళ్ళిపోయారు. వారిని వెనక్కు రప్పించేందుకు కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోజురోజుకి వారిపై ఒత్తిడి పెరుగుతుండటంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను తక్షణం ఆమోదించాలని స్పీకరును ఆదేశించవలసిందిగా వారు న్యాయస్థానాన్ని కోరారు. కానీ వారినే స్పీకరు ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వారు ఇంకా ఈ దాగుడుమూతలు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ తాజా పరిణామంతో కాంగ్రెస్‌-బిజెపిలు ఏవిధంగా పావులు కదుపుతాయో, అధికారం కోసం సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఏది లాభపడుతుందో చూడాలి.     Related Post