మా విధేయతను అనుమానించకండి: కోమటిరెడ్డి

June 19, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసి బిజెపిలో చేరే ఆలోచనలో ఉన్నట్లు చెప్పడం, ఆయన మా పార్టీలో చేరబోతున్నారన్నట్లు కిషన్‌రెడ్డి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డి కూడా బిజెపిలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.

వాటిపై వెంకట్‌రెడ్డి స్పందిస్తూ, “గత 3 దశాబ్ధాలుగా నేను కాంగ్రెస్‌లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వలననే నేడు నాకు ఈ గుర్తింపు, గౌరవం, పదవులు లభించాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీని విడిచి నేను ఎలా వెళ్లిపోతాను? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారుతానని చెప్పలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో విజయవకాశాలు ఉన్నప్పటికీ వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినందుకు ఆవేదనతో పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని అన్నారు తప్ప పార్టీ మరే ఉద్దేశ్యంతో కాదు. మాపై మీడియాలో ఒక వర్గం పనికట్టుకుని దుష్ప్రచారం సాగిస్తోంది. అది సరికాదని మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. భువనగిరి అభివృద్ధికి కృషి చేసి నన్ను ఎంపీగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను. అలాగే రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, వాటికి అనుమతుల కోసం గట్టిగా కృషి చేస్తాను,” అని అన్నారు. 

అంటే కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ మనసు మార్చుకొన్నారా? లేక రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని ఆశిస్తూ పార్టీపై ఈవిదంగా ఒత్తిడి చేస్తున్నారా? లేక పార్టీ చేత వేటు వేయించుకునే వరకు వేచి చూడాలనే ఆలోచనతో వెనక్కు తగ్గారా? అనే ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే లభించవచ్చు.


Related Post