రవిప్రకాష్ నేరస్తుడా?

May 21, 2019


img

గత రెండు వారాలుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా సోమవారం హైకోర్టులో ముందస్తు బెయిల్‌పై పిటిషన్‌ వేయించారు. బంజారా హిల్స్, సైబరాబాద్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన మూడు కేసులలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది కనుక ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మూడు వేర్వేరు పిటిషన్లు వేశారు. 

టీవీ9 స్వాధీనం చేసుకొన్న అలంద మీడియా సంస్థ ఎన్‌సీఎల్‌టీకి చెందిన కొన్ని అంశాలను దాచిపెట్టి తనపై తప్పుడు కేసులు బనాయించిందని, తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసి అవకాశమిస్తే ఆ కుట్రను బయటపెట్టడానికి సిద్దంగా ఉన్నానని రవిప్రకాశ్ న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులున్నందున తాత్కాలిక ధర్మాసనం ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపే అవకాశం ఉంది.  

టీవీ9 న్యూస్ ఛానల్ స్థాపించి ఎలక్ట్రానికి మీడియాలో ఒక సరికొత్త శఖానికి నాందిపలికి, మీడియా శక్తిని, గొప్పదనాన్ని, విలువలను లోకానికి చాటిచెప్పిన రవిప్రకాశ్‌ ఈవిధంగా వేధింపులకు భయపడి అజ్ఞాతంలో గడుపవలసిరావడం చాలా బాధాకరం. ఆయన అక్రమాలకు పాల్పడ్డాడా లేదా అనే విషయం రుజువు కాకమునుపే ఆయన నేరస్థుడు అన్నట్లు నిర్ధారించేయడం, ఆయనకు అండగా నిలబడవలసిన సాటి మీడియా మిత్రులే ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. 

రాజకీయనాయకులకు మీడియా లేకపోతే ప్రజలతో కనెక్ట్ కాలేరు కానీ అదే మీడియా నిలదీసి ప్రశ్నిస్తే సహించలేరని రవిప్రకాశ్‌ ఎదుర్కొంటున్న కష్టాలను చూస్తే అర్ధం అవుతుంది. న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసి తన వాదన వినిపించుకొనేందుకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది.


Related Post