తెలంగాణలో వాటి పరిస్థితి ఏమిటో?

May 20, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కూడా కాంగ్రెస్‌, బిజెపిలకు ఓటమి తప్పదని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి తెరాస 16 కాకపోయినా కనీసం 10-12 ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని అందరూ ముందే ఊహించారు. కానీ 12-16 సీట్లు గెలుచుకోబోతోందని సర్వేలు చెపుతున్నాయి. వాటి జోస్యం ఫలించినట్లయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలకు పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు. 

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయంతో డీలాపడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికలలో కూడా ఓడిపోతే ఇక కోలుకోవడం కష్టమే. లోక్‌సభ ఫలితాలు రాగానే మళ్ళీ ఫిరాయింపులు మొదలవవచ్చు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం తెరాసలో విలీనమైపోవచ్చు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవిలో నుంచి దిగిపోకతప్పదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడికి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిలాగే ఒంటరి పోరాటం చేయవలసి రావచ్చు. 

కానీ ఒకవేళ రాష్ట్రంలో ఓడిపోయినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదోవిదంగా అధికారంలోకి రాగలిగితే రాష్ట్ర కాంగ్రెస్‌ ఈ దెబ్బను కూడా తట్టుకొని కోల్కొనగలదు. తెరాస మద్దతు అవసరం లేకుండా కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, కేంద్రం సహాయసహకారాలతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తెరాసపై ప్రతీకారం తీర్చుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. ఒకవేళ తెరాస మద్దతుతో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయవలసివస్తే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తెరాస పట్ల మెతక వైఖరి అవలంభించవలసి వస్తుంది. 

ఇక రాష్ట్ర బిజెపి విషయానికి వస్తే, సర్వే సంస్థలు చెపుతున్నట్లు ఒకవేళ ఈసారి బిజెపి భారీ మెజార్టీతో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే, తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి రాష్ట్ర బిజెపి నేతలు గట్టిగా ప్రయత్నించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలలో తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని బిజెపి నేతలు చెపుతున్నారు కనుక కేంద్రప్రభుత్వం కూడా ఈసారి వారికి బాగా సహకరించవచ్చు. ఒకవేళ కేంద్రంలో తెరాస మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసివస్తే రాష్ట్ర బిజెపి నేతలు యధాప్రకారం తెరాస పట్ల మెతకవైఖరి అవలంభించక తప్పదు. 

కనుక తెరాస మద్దతు లేకుండా కాంగ్రెస్, బిజెపిలలో ఏది కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ అది తెరాసతో గతంలో కంటే తీవ్రస్థాయిలో పోరాటాలు చేయడం వీలైతే రాజకీయంగా దెబ్బ తీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ కేంద్రంలో ఆధికారంలోకి రాలేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిల పరిస్థితి మరింత దయనీయంగామారే ప్రమాదం ఉంటుంది. 



Related Post