ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం ఫలించేనా?

May 20, 2019


img

ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఏపీ సిఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రజలనాడిని తెలుసుకోవడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ విఫలమయ్యాయని, ఏపీలో మళ్ళీ టిడిపి అధికారంలోకి రాబోతోందని అన్నారు. నిన్న వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవ పరిస్థితులకు చాలా విరుద్దంగా ఉన్నాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపియేతర పార్టీలే అత్యదిక ఎంపీ స్థానాలు సాధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. 

గతంలో కంటే బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో సొంతంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని అన్ని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. కానీ బిజెపికి 200కు మించి సీట్లు రావని తెలంగాణ సిఎం కేసీఆర్‌ జోస్యం చెప్పగా, కాంగ్రెస్‌ మిత్రపక్షాలకే అత్యదిక స్థానాలు వస్తాయని చంద్రబాబు చెప్పుతున్నారు. 

వాస్తవ పరిస్థితులను నిష్పక్షపాతంగా చూసినట్లయితే  ఏపీ, తెలంగాణ, కేరళ మూడు రాష్ట్రాలలో కలిపి బిజెపి 2-3 సీట్ల కంటే గెలుచుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటకలో మాత్రం ఎక్కువ సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. ఇక 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసిన కారణంగా బిజెపికి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి అక్కడ ప్రియాంకా వాద్రాను రంగంలో దింపి కాంగ్రెస్ పార్టీ కూడా బిజెపికి గట్టి పోటీనిచ్చింది. ఇక బిజెపి చేజార్చుకొన్న కాంగ్రెస్ పార్టీ పాలిత మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజాస్థాన్ రాష్ట్రాలతో సహా ఈసారి బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ నిచ్చింది. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ బిజెపికి గట్టి పోటీ నిచ్చింది. అక్కడ బిజెపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని మమతా బెనర్జీ నమ్మకంగా చెపుతున్నారు. కానీ బిజెపి ప్రభంజనంలో మమతా బెనర్జీ కొట్టుకుపోబోతున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెపుతున్నాయి. 

ఒకవేళ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోతే ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు గెలుచుకొన్నప్పటికీ అవి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోకపోవచ్చు. వాస్తవ పరిస్థితులు ఈవిధంగా ఉండగా ఈసారి బిజెపి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెపుతున్నాయి. కనుక వాటి జోస్యంలో నిజానిజాలు తెలియాలంటే మే 23 వరకు వేచి చూడక తప్పదు.


Related Post