తెలంగాణకు కారు... ఏపీ ప్రజలకు సైకిల్: లగడపాటి

May 18, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సర్వేల గురించి చెప్పుకోవాలంటే టక్కున గుర్తొచ్చేది మాజీ కాంగ్రెస్‌ నేత లగడపాటి రాజగోపాల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు సర్వే ఫలితాలు అంటూ లగడపాటి చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఆయన చిలుక జోస్యం ఫలించకపోవడంతో మూటాముల్లె సర్దుకొని మాయం అయిపోయారు. ఇన్నాళ్ళుగా మీడియా ముందుకు రాలేదు. రేపటితో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది కనుక లగడపాటి మళ్ళీ జోస్యం చెపుతానంటూ నేడు విజయవాడలో మీడియా ముందుకు వచ్చి హడావుడి చేశారు. 

రేపు సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో తన సర్వే పూర్తి వివరాలను ప్రకటిస్తానని చెపుతూనే ఏపీలో మళ్ళీ టిడిపి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని చెప్పేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కనుక అక్కడి ప్రజలు కారును ఎంచుకొన్నారని, ఏపీ లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం కనుక ప్రజలు సైకిలును ఎంచుకొన్నారని లగడపాటి చెప్పారు. 

విశాఖలో గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తప్పకుండా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడని జోస్యం చెప్పారు. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన సీట్ల కంటే జనసేనకు కాస్త తక్కువ వస్తాయని లగడపాటి జోస్యం చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి తాను చెప్పిన జోస్యం ఫలించలేదని కనుక రేపు చెప్పబోయే జోస్యం తన విశ్వసనీయతకు పరీక్షగానే భావిస్తున్నానని లగడపాటి అన్నారు.


Related Post