కాంగ్రెస్‌ కోసం బాబు ఎందుకు అంత శ్రమపడుతున్నారో?

May 18, 2019


img

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం డిల్లీ సిఎం కేజ్రీవాల్, సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారం ఏచూరిలతో సమావేశమయ్యారు. శనివారం ఉదయం సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాలతో సమావేశమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇవాళ్ళ మధ్యాహ్నం లక్నో వెళ్ళి అఖిలేశ్‌ యాదవ్‌, వీలైతే మాయావతితో కూడా భేటీ కానున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌-టిడిపిలు బద్ద శత్రువులు. ఇప్పుడు జిగిరీ దోస్తులు. అందుకే ఏపీ సిఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టడానికి మిత్రపక్షాల చుట్టూ తిరుగుతున్నారనిపించడం సహజమే. కానీ చంద్రబాబు కాంగ్రెస్‌ కోసమే అంత కష్టపడుతున్నారా?అని ఆలోచిస్తే ఇతర కారణాలు కూడా కనిపిస్తాయి. 

ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి ఓడిపోతే, కేంద్రంలో నరేంద్రమోడీ మళ్ళీ ప్రధానిగా, ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడితే వారు తనపై కక్షసాధింపులకు పాల్పడవచ్చని చంద్రబాబు భయం కావచ్చు. అదే...కాంగ్రెస్‌ మిత్రపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్నట్లయితే రాష్ట్రంలో టిడిపి ఓడిపోయినప్పటికీ ఎవరూ చంద్రబాబునాయుడును ఇబ్బంది పెట్టలేరు. 

ఒకవేళ ఏపీలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చి, కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రధాని అయినా చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు తప్పవు. కనుక ఒకవేళ బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోతే తనకు అనుకూలమైన వారిని గద్దె ఎక్కించేందుకు చంద్రబాబు శ్రమ తీసుకొంటున్నారని చెప్పవచ్చు. కానీ ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ బిజెపి కూటమి గెలిచి అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అలాగని చేతులు ముడుచుకొని కూర్చోంటే నష్టపోయేది ఆయనే కనుక తన శక్తిమేర కాంగ్రెస్‌ మిత్రపక్షలను ఏకత్రాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు.


Related Post