అందుకే కాంగ్రెస్‌ విలీనం వాయిదా పడిందా?

May 17, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపుల తరువాత ఘట్టం...కాంగ్రెస్‌ శాసనసభా పక్షం తెరాసలో విలీనం. ఈ నెల మొదటివారంలోనే విలీనం అయిపోవచ్చునని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి కానీ ఇంతవరకు విలీనం జరుగలేదు. కనీసం ఆ ఊసు కూడా వినిపించడంలేదిప్పుడు. నేడోరేపో విలీనం అయిపోతుందనుకొంటున్నప్పుడు హటాత్తుగా దీనిపై ఇంత నిశబ్ధం ఎందుకు ఏర్పడింది? అని ఆలోచిస్తే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న సందిగ్ధతే కారణంగా కనిపిస్తోంది. 

ఈసారి కాంగ్రెస్‌, బిజెపిలు ప్రభుత్వం ఏర్పాటుచేయలేవని బలంగా నమ్ముతున్న సిఎం కేసీఆర్‌, లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత ఫెడరల్‌ ఫ్రంట్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయని అంచనా వేస్తున్నారు. కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కనుక తప్పనిసరిగా కాంగ్రెస్‌, బిజెపిలలో ఏదో ఒక పార్టీ మద్దతు స్వీకరించవలసి ఉంటుంది. మతతత్వ బిజెపితో పొత్తులు పెట్టుకోవడం కంటే సెక్యులర్ ముద్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడమే మంచిదని కేసీఆర్‌ భావించడం సహజం. 

ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయవలసి వచ్చినా లేదా కాంగ్రెస్‌ మద్దతు స్వీకరించవలసి వచ్చినా అప్పుడు ఆ పార్టీతో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం విలీనాన్ని వాయిదా వేసినట్లు భావించవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ కేంద్రంలో అదే పార్టీతో కేసీఆర్‌ చేతులు కలుపుతారా లేదా?అంటే తెరాస రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం తప్పకపోవచ్చు. 

కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి కేసీఆర్‌ సంకోచించవచ్చునేమో గానీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి అవసరమైతే తెరాస మద్దతు తీసుకోవడానికి కాంగ్రెస్‌ ఏమాత్రం సంకోచించదని చెప్పవచ్చు. కనుక మే 23న ఫలితాలు వెల్లడైన తరువాత పార్టీల బలాబలాలు, వాటి సమీకరణాలపై స్పష్టత వచ్చిన తరువాత మళ్ళీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కాంగ్రెస్‌ శాసనసభా పక్షం తెరాసలో విలీనంపై సిఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవచ్చు. కనుక రాష్ట్ర కాంగ్రెస్‌ నెత్తి మీద ఇంకా ‘విలీనం కత్తి’ వ్రేలాడుతూనే ఉందని చెప్పక తప్పదు.


Related Post