కాళేశ్వరంపై వారి వాదనలు తప్పు: కేసీఆర్‌

May 17, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టు-విద్యుత్ వినియోగం, సరఫరా గురించి సిఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల కోసం ఏర్పాటు చేస్తున్న భారీ పంప్‌హౌస్‌లకు సుమారు 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ అవసరమైతే 17,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేయగలమని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు సిఎం కేసీఆర్‌కు తెలిపారు. 

వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిర్వహణ రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని కొందరు వితండవాదం చేస్తున్నారు. ఒక్కో ప్రాంతం...రాష్ట్రం...దేశం అవసరాలు వేర్వేరుగా ఉంటాయి కనుక వాటిని బట్టే ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఉంటాయి. రాష్ట్రంలో గ్రావిటీ పద్దతిలో నీరు పారే అవకాశం లేదు కనుకనే ఎత్తిపోతల పధకాలకు వెళ్లవలసివస్తోంది. ఎత్తిపోతలకు భారీగానే విద్యుత్ అవసరం పడుతుందని తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యే విద్యుత్ ఖర్చు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రైతులపై మోపదలచుకోలేదు. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీళ్ళు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. కనుక ప్రాజెక్టు పూర్తయ్యి పంటలకు నీళ్లు అందించగలిగితే పంట దిగుబడి భారీగా పెరుగుతుంది. అప్పుడు రెండేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రాబట్టుకొన్నట్లవుతుంది. ఈ ఏడాది నుంచే 540-600 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయాలని నిశ్చయించుకొన్నాము కనుక నీటి లభ్యత, పంప్‌హౌస్‌లకు ఎంత విద్యుత్ అవసరం పడుతుందనే దానిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని అధికారులు సిద్దంగా ఉండాలి,” అని అన్నారు.


Related Post