ఫెడరల్‌ ఫ్రంట్‌ చేయగలిగింది అదే: అమిత్ షా

May 16, 2019


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఎన్నికలు చివరిదశకు చేరుకొన్నాక ఇప్పుడు దాని గురించి మాట్లాడారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “6వ దశ ఎన్నికలు పూర్తయ్యేసరికే మా కూటమి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని ఎంపీ సీట్లు గెలుచుకోబోతోందని స్పష్టం అయ్యింది. మే 19న జరుగబోయే చివరిదశ పోలింగులో బిజెపి 310 మార్క్ దాటేసి ఎవరి మద్దతు అవసరం లేకుండా సొంతంగానే కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. కనుక కాంగ్రెస్‌ కూటమి, కేసీఆర్‌ కూటములు చేయగలిగేదేమీ ఉండదు. మహా అయితే అవి లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడిని ఎన్నుకొనేందుకు పనికివస్తాయి,” అని అన్నారు. 

ఈసారి బిజెపికి 200కు మించి ఎంపీ సీట్లు రావని, తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం పడుతుందని దేశంలో మీడియా, ప్రతిపక్షాలు వాదిస్తుంటే, బిజెపి 310 సీట్లు గెలుచుకోబోతోందని అమిత్ షా చెపుతున్నారు. ఆయన ఆ నమ్మకంతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి ఉపయోగం ఉండదని చెపుతున్నారా లేక సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నారనే మీడియాలో ఊహాగానాలు చూసి ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం లేదంటున్నారో?


Related Post