కేసీఆర్‌ అటువెళ్ళగానే బాబుతో డిఎంకె భేటీ!

May 14, 2019


img

సిఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం చెన్నైలో డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యి ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరవలసిందిగా ఆహ్వానించగా, కేసీఆర్‌నే కాంగ్రెస్‌ కూటమిలో చేరవలసిందిగా ఆయన కోరినట్లు డిఎంకె అధికార ప్రతినిధి శరవణన్‌ అన్నాదురై ట్వీట్ చేశారు. ఆ ప్రతిపాదనకు కేసీఆర్‌ స్పందన ఏమిటో తెలియదు కానీ కేసీఆర్‌ అటు వెళ్ళగానే డిఎంకె పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ కోశాధికారి దురై మురుగన్ మరికొందరు నేతలు మంగళవారం మధ్యాహ్నం అమరావతి వచ్చి ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో భేటీ అవడం విశేషం. 

చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు కనుక వారి సమావేశానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. వారు కేసీఆర్‌-స్టాలిన్ భేటీ గురించే ప్రధానంగా మాట్లాడుకొంటారని వేరేగా చెప్పనవసరం లేదు. ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి డిఎంకె పార్టీని ఆహ్వానించడానికి కేసీఆర్‌ చెన్నై వెళితే ఆ విషయం గురించి చంద్రబాబునాయుడు చెప్పడానికి డిఎంకె నేతలు పనిగట్టుకొని ఇంత హడావుడిగా అమరావతికి రానవసరం లేదు. ఒకవేళ డిఎంకె పార్టీ ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరాలని నిర్ణయించుకొన్నా అందుకు వారు చంద్రబాబునాయుడు అనుమతి తీసుకోనవసరం లేదని అందరికీ తెలుసు. మరి వారు ఇంత హడావుడిగా అమరావతికి వచ్చి చంద్రబాబునాయుడును ఎందుకు కలుసుకొన్నారు? అనే సందేహం కలుగుతుంది. చంద్రబాబు-కేసీఆర్‌కు డిఎంకె పార్టీ మధ్యవర్తిత్వం నెరుపుతోందా? లేదా కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారా? అందుకు ఏమైనా షరతులు విధించారా? అవి చెప్పడానికే డిఎంకె నేతలు ఇంత హడావుడిగా అమరావతికి వచ్చి చంద్రబాబునాయుడును కలిశారా? అనే సందేహాలే సమాధానాలుగా కనిపిస్తున్నాయి.


Related Post