కాంగ్రెస్‌, బిజెపి దోస్తీ!

May 14, 2019


img

కాంగ్రెస్‌, బిజెపిలు రాజకీయ శత్రువులని అందరికీ తెలుసు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపి నేతలు మాత్రం తెరాసను ఎదుర్కోవడానికి తమ శతృత్వం కాసేపు పక్కన పెట్టి కలిసిమెలిసి పోరాడుతున్నారు. 

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌, పంజాగుట్ట జంక్షన్ వద్ద అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన డా.అంబేడ్కర్ విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి నేతలు మంగళవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి డా.అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్ళీ అదే స్థానంలో ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. 

అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు బడుగుబలహీన వర్గాల పట్ల ఎంత చులకన భావం ఉందో తెలుసుకోవడానికి డా.అంబేడ్కర్ విగ్రహం తొలగింపే ఒక ఉదాహరణ అని అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని మళ్ళీ విగ్రహాన్ని పంజగుట్ట సర్కిల్లో ఏర్పాటుచేయాలి,” అని అన్నారు.

బిజెపి నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, “కోట్లాది మంది ప్రజలకు పూజ్యనీయుడైన డా.అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా తీసి డంపింగ్ యార్డులో పడేసింది. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. డా.అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్ళీ యధాస్థానంలో ప్రతిష్టించాలి. విగ్రహాన్ని కూల్చివేయాలని ఆదేశించినవారిపై చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు. 

మహనీయుల ఆశయాలు పాటించని రాజకీయనాయకులు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు వారి పేరుతో రాజకీయాలు చేస్తుండటం కొత్తేమీ కాదు. కాంగ్రెస్‌, బిజెపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ కలిసి పోరాడిన దాఖలాలు లేవు. కానీ తెరాస సర్కారును ఈవిధంగా ఇబ్బందిపెట్టే అవకాశం ఏదైనా లభిస్తే ఉప్పు, నిప్పులా వ్యవహరించే రెండు పార్టీలు కలిసి పోరాడుతుంటాయి. అంటే వాటి పోరాటాలలో ఏపాటి నిజాయితీ ఉందో అర్ధం చేసుకోవచ్చు.


Related Post