మే 23 తరువాత ఉత్తమ్ దిగిపోక తప్పదా?

May 14, 2019


img

గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి విజయావకాశాలున్నప్పటికీ ఓడిపోయింది. కానీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్‌ అధిష్టానం పూర్తి నమ్మకముంచి ఆయనకు అన్ని విధాలా అండగా నిలబడింది. కానీ గత ఎన్నికల కంటే కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికలలో ఓడిపోవడమే కాకుండా, టికెట్ల పంపిణీ వ్యవహారంలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆరోపణలు చేసినవారిపై సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించినప్పటికీ వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి కొంతమంది సీనియర్ కాంగ్రెస్‌ నేతలు నేటికీ టికెట్ల కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

రెండురోజుల క్రితం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలోనే వి.హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిరకాలంగా పార్టీ జెండాను మోస్తున్నవారికి కాకుండా ఒక కులం, వర్గం నేతలకే మళ్ళీ మళ్ళీ టికెట్లు కేటాయిస్తున్నాన్నారని తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మికి నల్గొండ నుంచి టికెట్ కేటాయించారు. పార్టీలో అసంతృప్తిజ్వాలలు నానాటికీ పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం దానిని పట్టించుకోవడంలేదని స్పష్టం అయ్యింది. 

ఇక కాంగ్రెస్ పార్టీలో దశాబ్ధాలుగా పనిచేస్తున్న సీనియర్ నేతలు అనేకమంది ఉన్నప్పటికీ వారీనందరినీ పక్కనపెట్టి కొత్తగా వచ్చి చేరిన రేవంత్‌ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ మళ్ళీ వెంటనే లోక్‌సభ టికెట్ కేటాయించడంపై పార్టీలో నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో రేవంత్‌ రెడ్డి ఓడిపోయినా లేదా కాంగ్రెస్‌ మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయినా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు సాధిస్తే పరువాలేదు లేకుంటే పార్టీలో అసంతృప్త నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి చేయవచ్చు. ఆయన పదవీకాలం కూడా ముగిసిపోయినందున కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉంది.


Related Post