మోడీ ఒక విచ్చినవాది: టైమ్ పత్రిక

May 11, 2019


img

అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ‘టైమ్ పత్రిక’ మే-2019 సంచికలో కవర్ పేజీ ఆర్టికల్ గా ప్రధాని నరేంద్రమోడీపై ఒక కధనం ప్రచురించింది. కవర్ పేజీపై మోడీ చిత్రం పక్కన ‘ఇండియాస్ డివైడర్ ఇన్-చీఫ్’ అని టైటిల్ పెట్టింది. 

“2014 ఎన్నికల సమయంలో భారత్‌కు ఆయన ఒక ఆశా జ్యోతి...మహాపురుషుడు. 2019 ఎన్నికలొచ్చేసరికి ఎటువంటి ఆశా లేదు...ఒక విఫల రాజకీయనాయకుడుగా మిగిలిపోయారు. దేశాన్ని విభజించి పాలిస్తున్న విచ్చినవాదిగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. మోడీ పాలనలొ దళితులు, ముస్లింలు, క్రైస్తవులు ఇతర మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. హిందుత్వ భావజాలాన్ని బలవంతంగా దేశప్రజలపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతరమతస్తులను ద్వేషించేవారికి పదవులు కట్టబెడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న ఆర్ధికవిధానాలతో ఏవో అద్భుతాలు జరుగుతాయనుకొంటే కనీసం ఆశించిన ప్రయోజనాలు కూడా నెరవేర్చలేకపోయింది. మోడీ ప్రభుత్వం జాతీయవాదం ముసుగులో మతత్వం ప్రేరేపించి ప్రజల మద్య చీలికలు సృష్టించింది. దేశంలో ప్రతిపక్షాల బలహీనతను తన బలంగా ఉపయోగించుకొంటున్నారు. అన్ని విధాలా విఫలమైన ఇటువంటి వ్యక్తిని భారతీయులు మళ్ళీ ప్రధానిగా అంగీకరిస్తారా? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ మరో 5 ఏళ్ళపాటు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా?” అంటూ ప్రముఖ జర్నలిస్టు ఆతిష్‌ తసీర్‌ వ్రాసిన కధనాన్ని టైమ్ పత్రిక ప్రచురించింది. 

ప్రధాని నరేంద్రమోడీ పట్ల దేశప్రజలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పుడు ఒక విదేశీ పత్రిక ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదు. నరేంద్రమోడీ హయాంలోనే దేశంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకొన్నాయని వాదించేవారున్నారు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాల వలన దేశాభివృద్ధి నిలిచిపోవడమే కాక మళ్ళీ వెనక్కు వెళ్లిపోయిందని వాదించేవారు కూడ ఉన్నారు. కనుక ఆయన పాలనకు, వ్యక్తిత్వానికి రిఫరెండంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో దేశప్రజలు ఏమి తీర్పు ఇస్తారో అదే మెజారిటీ అభిప్రాయంగా భావించవవలసి ఉంటుంది.


Related Post